ఢిల్లీకి మంత్రి పదవి లొల్లి..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు త్వరలోనే జరగనున్న రాష్ట్ర కేబినెట్ విస్తరణలో మంత్రి పదవి దక్కడం ఖాయమన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఉమ్మడి జిల్లాకు చెందిన అధికార కాంగ్రెస్ శాసనసభ్యులు మంత్రి పదవి దక్కించుకునేందుకు తీవ్రస్థాయిలో ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
దిశ ప్రతినిధి, నిర్మల్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు త్వరలోనే జరగనున్న రాష్ట్ర కేబినెట్ విస్తరణలో మంత్రి పదవి దక్కడం ఖాయమన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఉమ్మడి జిల్లాకు చెందిన అధికార కాంగ్రెస్ శాసనసభ్యులు మంత్రి పదవి దక్కించుకునేందుకు తీవ్రస్థాయిలో ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఉమ్మడి జిల్లా నుంచి మంచిర్యాల శాసనసభ్యుడు ప్రేమ్ సాగర్ రావు, చెన్నూరు బెల్లంపల్లి శాసనసభ్యులు గడ్డం వివేక్, గడ్డం వినోద్, ఖానాపూర్ శాసనసభ్యుడు వెడ్మ బొజ్జులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. నలుగురిలో ఒకరికి మంత్రి పదవి దక్కడం ఈసారి ఖాయమే. అయితే ఆ పదవి ఎవరికి దక్కుతుందనే అంశం కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు ఉమ్మడి జిల్లా ప్రజల్లో ఉత్కంఠ రేపుతున్నది.
ఢిల్లీకి పంచాయితీ..!
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి మంత్రి పదవి చేజిక్కించుకునేందుకు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ముందు వరసలో ఉన్నారు. పార్టీ కోసం తొలి నుంచి కష్టపడుతున్న ఆయనకు పదవి ఇవ్వడం సముచితం అన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఆయనకు అనుచర గణం కూడా ఉన్నది. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు, భారత్ రాష్ట్ర సమితి పార్టీని తట్టుకొని ఉమ్మడి జిల్లాలో పార్టీ కోసం ఆర్థికంగా ఆయన అండగా నిలిచారన్న పేరు ఉంది. కాగా చెన్నూర్ శాసనసభ్యుడు జి.వివేక్ వెంకటస్వామి కూడా మంత్రి పదవి కోసం గట్టిగా పట్టుబడుతున్నారు. పార్టీలు మారినప్పటికీ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల సమయంలో అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఆయన పార్టీలో చేరడంతో పాటు ఎన్నికల ఖర్చు విషయంలో తన నియోజకవర్గంలో పాటు ఇతర నియోజకవర్గాలకు కూడా ఆర్థికంగా అండగా నిలిచారని చెబుతున్నారు. ఆయన సోదరుడు మాజీ మంత్రి జి వినోద్ బెల్లంపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఇప్పుడు ఆయన కూడా మంత్రి పదవిని ఆశిస్తున్నారు. ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు కూడా గిరిజన కోటాలో తన పేరు పరిశీలించాలని అధిష్టానాన్ని కోరుతున్నారు.
ఈ పరిస్థితుల్లో ఎవరి పేరును ప్రతిపాదించిన తలనొప్పి మొదలవుతుందన్న ఆలోచనతో పార్టీ రాష్ట్ర అధిష్టానం ఈ విషయాన్ని ఢిల్లీ పెద్దలకు వదిలేసినట్లు చెబుతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ లు ఇద్దరు కూడా వారిని కలిసిన ఆశావహులకు ఇదే విషయం చెప్పినట్లు సమాచారం. మంత్రి పదవికి అందరికీ అర్హత ఉన్నప్పటికీ ఎవరిని ఎంపిక చేయాలో తేల్చలేని పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఢిల్లీ హై కమాండ్ తీసుకునే నిర్ణయానికి అందరూ కట్టుబడాలని చెప్పినట్లు కూడా తెలుస్తోంది. కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కే సి వేణుగోపాల్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ దీపా దాస్ మున్షి ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటారని పార్టీ రాష్ట్ర అధిష్టానం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్యేలకు సమాచారం ఇచ్చినట్లు ప్రచారం జరుగుతున్నది.
జిల్లాకు చీఫ్ విప్ పదవి..!
రాష్ట్ర కేబినెట్ విస్తరణలో ఒకరికి మంత్రి పదవి దక్కడం ఖాయం అన్న ప్రచారం జరుగుతుండగా అదే సందర్భంలో అసెంబ్లీలో కీలకమైన ప్రభుత్వ చీఫ్ విప్ పదవి విషయం కూడా చర్చకు వస్తున్నది. మంత్రి పదవి కోసం రాష్ట్రవ్యాప్తంగా పోటీ విపరీతంగా పెరిగితే ఉమ్మడి జిల్లాకు ప్రభుత్వ చీఫ్ విప్ పదవి ఇస్తారని పార్టీ సీనియర్ నేత ఒకరు దిశ ప్రతినిధికి తెలిపారు.