Indrakaran Reddy: ప్రాణహిత పుష్కరాలను ప్రారంభించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గం - Minister Indrakaran Reddy inaugurated the Pranahita Pushkaralu
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గం అర్జునగుట్టలో దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి బుధవారం ప్రాణహిత పుష్కరాలను ప్రారంభించారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ దంపతులు, ఎమ్మెల్సీ దండే విఠల్, జెడ్పీ చైర్ పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి మధ్యాహ్నం 3.50 గంటలకు పుష్కరుడికి పూజలు చేసి, పుణ్య స్నానం ఆచరించి, నదీ హారతి ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేవాదాయ శాఖ మంత్రిగా గతంలో గోదావరి, కృష్ణ పుష్కరాల్లో, ఇప్పుడు ప్రాణహిత పుష్కరాల్లో పుణ్యస్నానం ఆచరించటం మహాభాగ్యంగా భావిస్తున్నాని తెలిపారు. సీఎం కేసీఆర్ సారధ్యంలో గోదావరి, కృష్ణ పుష్కరాలను ప్రతిష్ఠాత్మకంగా చేపట్టి విజయవంతంగా నిర్వహించామన్నారు.
ప్రాణహిత పుష్కరాలను ఇవాళ్టి నుంచి 24 వరకు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని తెలిపారు. ఈ పుష్కరాలకు తెలంగాణ సహా ఇతర రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలి వచ్చే అవకాశం ఉందని, దానికి తగ్గట్లుగా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని వెల్లడించారు. జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, కుమ్రం భీం-ఆసిఫాబాద్ జిల్లాల కలెక్టర్లు.. వివిధ శాఖల అధికారులను సమన్వయం చేస్తూ.. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లను చేశారన్నారు. యుద్ధప్రాతిపదికన పుష్కరాల ఏర్పాట్లను పూర్తి చేసిన అధికారులను ఈ సందర్భంగా మంత్రి కలెక్టర్లను, ఇతర అధికారులను అభినందించారు. పుష్కరాలకు వచ్చే భక్తుల కోసం దేవాదాయ శాఖ ఆలయాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేసిందన్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ కాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయంతో పాటు ఇతర దేవాస్థానాల ముస్తాబు (పేయింటింగ్స్, లైటింగ్ తదితర పనులు), ప్రత్యేక క్యూ లైన్లు, చలువ పందిళ్ళు, డ్రెస్ చేంజింగ్ రూంలను ఏర్పాటు చేసిందని తెలిపారు.