బీటౌన్ జర్నలిజాన్ని మార్చేసిన ఇండియాస్ ఫస్ట్ బ్లాగర్..
దిశ, ఫీచర్స్ : హిందీ ఆల్బమ్ సాంగ్‌లో ‘బ్యాకప్ డ్యాన్సర్’గా కెరీర్ ప్రారంభించి, ‘బ్లాగింగ్’ గురించి చాలామందికి తెలియని సమయంలో ‘బ్లాగర్’గా అవతారమెత్తి భిన్నమైన జర్నలిజాన్ని బీటౌన్‌కు పరిచయం చేసిందో యువతి..Latest Telugu News
దిశ, ఫీచర్స్ : హిందీ ఆల్బమ్ సాంగ్‌లో 'బ్యాకప్ డ్యాన్సర్'గా కెరీర్ ప్రారంభించి, 'బ్లాగింగ్' గురించి చాలామందికి తెలియని సమయంలో 'బ్లాగర్'గా అవతారమెత్తి భిన్నమైన జర్నలిజాన్ని బీటౌన్‌కు పరిచయం చేసిందో యువతి. ఆమె కంటే ముందు బాలీవుడ్ జర్నలిజంలో 'బ్రేకింగ్ న్యూస్, జ్యూసీ గాసిప్, స్పైసీ స్టోరీ, స్కాండల్స్' వంటి కామన్ వార్తలే కనిపించేవి. ఇక ఇంటర్వ్యూ చదివితే రాబోయే సినిమాలేంటి, సహ-నటులతో పని చేయడం ఎలా ఉంది? వంటి సాధారణ ప్రశ్నలకే చోటుండేది. కానీ 2014లో 'హ్యాపీ న్యూ ఇయర్' మూవీ రిలీజ్ సందర్భంగా అందులోని సినీస్టార్స్‌ను ఇంటర్వ్యూ చేసేందుకు తమ స్లాట్ కోసం వెయిట్ చేస్తున్న జర్నలిస్టుల వరసలో ఆమె కూడా ఉంది. 8 గంటల నిరీక్షణ తర్వాత, ఎప్పుడో తెల్లవారుజామున ఆమె వంతు వచ్చింది. నటీనటులకు కప్ కేక్స్ ఇవ్వడంతో పాటు, వారితో చరేడ్స్ గేమ్(గెస్సింగ్ గేమ్) ఆడించింది. తమ అభిమాన తారలను(షారుఖ్, అభిషేక్, సోనూ సూద్) తొలిసారి అలా సరదాగా చూసిన ప్రేక్షకులు అమితంగా ఇష్టపడ్డారు! ఆ క్షణం మొదలు దశాబ్ద కాలంగా కంటెంట్ క్రియేషన్ స్పేస్‌ను ఏలుతూ, 'బ్లాగ్'ను లక్షలాది రూపాయల వ్యాపారంగా మార్చిన మొదటి భారతీయురాలిగా మాలిని అగర్వాల్ అకా మిస్ మాలిని చరిత్ర సృష్టించింది.
సినిమా వ్యక్తులను చాలామంది 'పబ్లిక్ ఫిగర్స్'గా పరిగణిస్తుంటారు. కానీ వాళ్లకు కూడా ప్రైవేట్ స్పేస్, పర్సనల్ లైఫ్ ఉండటం సాధారణమే కదా! అయితే పోటీ కోసమో, రేటింగ్, వ్యూయర్‌షిప్ కోసమో తెలియదు కానీ చేతిలో మైక్ ఉంది కదా అని నోటికొచ్చింది అడుగుతుంటారు. భార్యభర్తల గొడవల నుంచి పార్టీల్లో చిందేయడం వరకు ఎన్నో వెకిలి ప్రశ్నలతో ఇబ్బంది పెడుతుంటారు. సరిగ్గా ఇదే విషయంలో మాలిని అగర్వాల్ పరిణతి చూపించింది. రాతల్లోనూ, ప్రవర్తనలోనూ చాలా హుందాగా వ్యవహరించింది. ఆ వివేకమే మాలినికి ఇంత పెద్ద విజయాన్ని సాధించిపెట్టింది. ఇది ఒక్క రాత్రిలో సాధించిన అద్భుతం కాదు, సెలబ్రిటీలతో సంబంధాలను పెంపొందించుకోవడం నుంచి తమ అభిమాన నటుల నుంచి ప్రేక్షకులు ఏం ఇష్టపడతారో అర్థం చేసుకోవడం వరకు ఆమె సంవత్సరాలుగా కృషి చేసింది. కొత్తగా ప్రయత్నించింది. తెలివైన, మానవీయ రచనలు చేస్తూ కాంట్రవర్సీలకు దూరంగా ఉండి తనకు వచ్చిన సదావకాశాన్ని రెండు చేతులతో ఒడిసిపట్టుకుంది. ఆ నేర్పు, ఓర్పే బ్లాగింగ్‌లో ఆమె సక్సెస్ సాధించేందుకు, లక్షలాది రూపాయల బిజినెస్‌గా అది రూపాంతరం చెందేందుకు కారణమైంది.
సక్సెస్‌కు సీక్రెట్ సాస్ :
ఒక విభిన్నతను సృష్టించడం సహా తన కంటెంట్‌ను ప్రత్యేకమైన, వ్యక్తిగత పంథాలో ప్యాక్ చేయగలగడమే మాలిని విజయ సూత్రం. దీంతో వినోద ప్రపంచం గురించి పాజిటివ్‌గా మాట్లాడే ఒక స్వతంత్ర స్వరంగా ఆమె ఎదిగింది. వెకిలి మాటలకు, జుగుప్సాకరమైన కంటెంట్‌కు తావివ్వకపోవడం కూడా అందుకు కారణమైంది. 'ప్రతీ ఒక్కరి విషయంలో చాలా సున్నితంగా వ్యవహరించాను. గాసిప్ సరదాగానే ఉంటుంది. కానీ మీరు గీత దాటినప్పుడు హానికరమైనది' అని మాలిని పేర్కొంటోంది. బిజినెస్ పరంగా చూసుకుంటే.. తను ఇపుడు మార్కెటింగ్, టాలెంట్ మేనేజ్‌మెంట్, క్రియేటివ్ ఏజెన్సీ, ప్రొడక్షన్ హౌస్ సర్వీసెస్, కంటెంట్ వంటి ఐదు విభిన్న సర్వీస్‌లను అందిస్తోంది. ఈ మేరకు మిస్ మాలిని ఎంటర్‌టైన్‌మెంట్ కింద ఆమె అందిస్తున్న సర్వీస్‌లు ప్రతి నెలా 60 మిలియన్ జనాలకు చేరువవుతున్నాయి. కాగా ఇటీవల మిస్ మాలిని 'ది గుడ్ గ్లామ్ గ్రూప్'ను కొనుగోలు చేసింది.
మాలిని ఫ్యామిలీ అండ్ లైఫ్ :
ప్రయాగ్‌రాజ్(అప్పట్లో అలహాబాద్‌గా పిలిచేవారు) వంటి చిన్న నగరంలో జన్మించగా.. వాళ్ల నాన్న ఒక దౌత్యవేత్త. అతను సోమాలియా, లెబనాన్, గ్రీస్, జర్మని, బల్గేరియా, ఐవరీ కోస్ట్ తదితర ప్రాంతాల్లో పనిచేయడంతో మాలినికి కూడా ఆయా దేశాలు పర్యటించిన అనుభవం ఉంది. అంతేకాదు అమెరికన్ పాఠశాలల్లో విద్య నేర్చుకోవడం ఆమెకు సొంత అభిప్రాయాన్ని కలిగి ఉండే స్వతంత్రతను ఇచ్చాయి. ఆ తర్వాత డ్యాన్స్ అండ్ థియేటర్‌లోకి ప్రవేశించిన తను ప్రొఫెషనల్ డ్యాన్సర్‌గా తన కెరీర్ ఆరంభించింది. ఆరేళ్ల పాటు బ్యాకప్ డ్యాన్సర్‌గా మళ్లీ ప్రపంచమంతటా ప్రయాణిస్తూ షోస్ చేసింది. ఇండీ-పాప్ స్టార్స్ అందరి వెనుక డ్యాన్స్ చేసిన తను సుఖ్‌బీర్ ఆల్బమ్‌లోనూ కనిపించింది. ఇక ఆ కెరీర్‌కు గుడ్‌బై చెప్పి 2003లో ఎంటీవీ ఆసియా కంటెంట్ విభాగంలో పనిచేస్తున్నప్పుడే ఆర్‌జే అయ్యేందుకు మిడ్‌డే నిర్వహిస్తున్న ప్రైవేట్ రేడియోకు వెళ్లగా తనను ముంబైకి ఆర్‌జేగా తీసుకున్నారు. ఆ తర్వాత డిజిటల్ కంటెంట్ హెడ్‌గా ఛానెల్ Vకి వెళ్లిన తను, స్నేహితుడి సాయంతో 'బ్లాగింగ్' గురించి తెలుసుకుని మాలిని పేరుతో బ్లాగ్ ప్రారంభించింది.