ప్రజలకు అండగా నిలుస్తా
కష్టాల్లో ఉన్న ప్రజల కోసం అండగా నిలుస్తానని, ప్రజలందరి సంక్షేమాన్ని కోరుకునే వ్యక్తి తానని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
దిశ, కొత్తగూడెం రూరల్ : కష్టాల్లో ఉన్న ప్రజల కోసం అండగా నిలుస్తానని, ప్రజలందరి సంక్షేమాన్ని కోరుకునే వ్యక్తి తానని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తాను 5 సంవత్సరాలు పదవిలో లేనప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు ఎంతో ఆదరించారని, వారందరికి రుణపడి ఉంటానని, పదవిలో ఉన్నా లేకున్నా ప్రజల సంక్షేమం కోసం నిలబడతానని అన్నారు. బుధవారం ఇల్లందు క్రాస్ రోడ్డు సమీపంలో ఉన్న ఫారెస్ట్ సెంట్రల్ పార్క్ ఆవరణలో కొత్తగూడెం రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కార్తీక మాస వన సమారాధన మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు.
ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అండగా నిలిచే వ్యక్తులు ఎల్లప్పుడూ వారి మదిలో గుర్తుండిపోతారని అన్నారు. కేవలం ఒక రెడ్డి బంధువులే కాకుండా అన్ని కులాల వారికి అండగా ఉండి వారి సంక్షేమం కోసం పనిచేస్తానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తనను గుర్తించి పదవి ఇవ్వడం జరిగిందన్నారు. పదవికి న్యాయం చేస్తూ రాష్ట్రం అభివృద్ధిలో పాలుపంచుకుంటానని పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని రెడ్డి బంధువులంతా ఒక సంఘంగా ఏర్పడి ఐక్యంగా ముందుకు వెళ్లడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. సంఘం సభ్యులు అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కొరకు పాటుపడాలన్నారు. సేవ చేయడంతోనే గుర్తింపు లభిస్తుందని, ఆ దిశగా రెడ్డి కులస్తులు ముందుకు వెళ్లాలని సూచించారు. రెడ్డి సంక్షేమ భవన నిర్మాణానికి కావాల్సిన భూమిని సొంతంగా కొనుగోలు చేసి నిర్మాణం జరిగే విధంగా కృషి చేస్తానన్నారు.
ఏడాదికి ఒకసారి వచ్చే కార్తీకమాస వన సమారాధన మహోత్సవం సందర్భంగా అందరూ ఒక దగ్గర కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. అనంతరం లక్ష్మీదేవిపల్లి మండలం చాతకొండ గ్రామపంచాయితీ రహదారి పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్ఎస్ కన్వెన్షన్ హాలును ప్రారంభించారు. ఈ వన సమారాధన మహోత్సవ కార్యక్రమంలో అశ్వరావుపేట ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు రెడ్డి, జాగృతి అధినేత మాధవరెడ్డి, కొత్తగూడెం రెడ్డి సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు లేళ్ల వెంకటరెడ్డి, అధ్యక్షులు వజ్రాల జమలా రెడ్డి, ప్రధాన కార్యదర్శి యరమల శ్రీనివాస్ రెడ్డి, గౌరవ సలహాదారులు ముప్పాని సోమిరెడ్డి, కృష్ణారెడ్డి, పిచ్చి రెడ్డి, ఉడుముల తిరుపతి రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ జవహర్ రెడ్డి, రెడ్డెం తులసి రెడ్డి, ఎన్. వెంకట్ సుబ్బారెడ్డి, అధికార ప్రతినిధి వై.శ్రీనివాస్ రెడ్డి, కోశాధికారి కాసాని శ్రీనివాస్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ నరేందర్ రెడ్డి, గుణాకరెడ్డి, వైస్ ప్రెసిడెంట్ విజయభాస్కర్ రెడ్డి, కందుల సుధాకర్ రెడ్డి, ఆర్గనైజింగ్ కార్యదర్శి విప్లవ రెడ్డి, కొప్పుల శ్రీనివాసరెడ్డి, అన్నపురెడ్డి శ్యాంసుందర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు.