లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలి
ఇందిరమ్మ ఇండ్లు, జీవో నెంబర్ 76 లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు.
దిశ, కొత్తగూడెం : ఇందిరమ్మ ఇండ్లు, జీవో నెంబర్ 76 లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. బుధవారం జిల్లాలోని ఆర్డీఓలు, తహసీల్దార్లతో ప్రజావాణిలో వచ్చిన భూమి ఫిర్యాదులు , జీవో నెంబర్ 76, పోడు భూముల సమస్యలు, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికపై జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో భూ సమస్యలపై వచ్చిన దరఖాస్తులపై త్వరితగతిన నివేదికలు అందించాలని, సమస్యలతో కార్యాలయాలకు వచ్చే ప్రజలను ఇబ్బందులకు గురి కాకుండా తగిన పరిష్కారం చూపించాలని అధికారులను ఆదేశించారు. జీవో నెంబర్ 76 ప్రకారం వచ్చిన దరఖాస్తులను తహసీల్దార్లు అందరూ తమ పరిధిలో క్షేత్ర స్థాయి పరిశీలన పూర్తి అయినవి, ఇంకా పరిశీలన చేయాల్సినవి, పరిశీలన అనంతరం తిరస్కరించిన దరఖాస్తులు, డిమాండ్ నోటీస్ జారీ చేసిన దరఖాస్తులు, చెల్లింపులు పూర్తిచేసిన దరఖాస్తులు మొత్తం పూర్తి వివరాలతో కూడిన నివేదికలను అందించాలని ఆదేశించారు.
జీవో నెంబర్ 76 ప్రకారం 2014 ముందు ఉన్న ధ్రువీకరణ పత్రాలు తప్పకుండా దరఖాస్తుకు జతపరచాలన్నారు. లబ్ధిదారుల ఎంపికలో ఎటువంటి అవకతవకలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తహసీల్దార్లు తమ పరిధిలోని పోడు భూమి సమస్యలకు సంబంధించి పట్టా పాస్ పుస్తకం జారీ కాని వారి వివరాలకు సంబంధించి నివేదికలను అందించాలని కోరారు. జిల్లాలో మొత్తం 323 ఇందిరమ్మ ఇండ్లు అందుబాటులో ఉన్నాయని, వాటికి గాను లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాలని ఆయన అన్నారు. లబ్ధిదారుల ఎంపికను క్షేత్రస్థాయిలో పర్యటించి నిరుపేద కుటుంబాలను గుర్తించాలని అన్నారు.
ప్రతి గ్రామంలో ఎస్సీ, ఎస్టీ కాలనీలు, నిరుపేద కుటుంబాలు నివసించే కాలనీల్లో సందర్శించి పేదలను గుర్తించాలన్నారు. రానున్న మూడు రోజుల్లో నిరుపేద కుటుంబాలను గుర్తించి నివేదిక అందించాలని, నివేదికలను అనుసరించి ప్రతి గ్రామంలో గ్రామ సభలు నిర్వహించి అందరి సమక్షంలో లబ్ధిదారుల జాబితా పై అభ్యంతరాలు సేకరించాలని అన్నారు. అనంతరం లబ్ధిదారుల ఎంపిక తుది జాబితా సిద్ధం చేయాలన్నారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో అధికారులు ఎటువంటి అవకతవకలకు పాల్పడినా ఉపేక్షించేది లేదని కలెక్టర్ హెచ్చరించారు.