భద్రాచలం మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా తెల్లం సీతమ్మ
భద్రాచలం వ్యవసాయ మార్కెట్ కొత్త కమిటీని ఏర్పాటు చేస్తూ బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
దిశ, దుమ్ముగూడెం : భద్రాచలం వ్యవసాయ మార్కెట్ కొత్త కమిటీని ఏర్పాటు చేస్తూ బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ తో కలుపుకొని మొత్తం 16 మంది సభ్యులతో నూతన కమిటీని ప్రభుత్వం నియమించింది. భద్రాచలం మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా తెల్లం సీతమ్మ, వైస్ చైర్మన్ గా కణితి సమ్మయ్య నియమితులయ్యారు.
కొత్తగా ఎన్నికైన కమిటీ రెండేళ్లపాటు కొనసాగనుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. దుమ్ముగూడెం మండలం బండిరేవు గ్రామానికి చెందిన సీతమ్మ దుమ్ముగూడెం మండలంలో ఇదివరకు జెడ్పీటీసీ, ఎంపీపీగా కొనసాగారు. ఈ సందర్భంగా తెల్లం సీతమ్మ మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన ఎమ్మెల్యే వెంకట్రావుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని చెప్పారు.