ఎరువులు, పురుగుల మందుల్లో భారీ కల్తీ.. తీవ్ర ఆగ్రహంలో రైతులు
దిశ, కల్లూరు (సత్తుపల్లి) : ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని ఎరువులు, పురుగు మందుల షాపులో భారీ స్థాయిలో కల్తీ పొటాషియం నిల్వలు బయటపడ్డాయి.
దిశ, కల్లూరు (సత్తుపల్లి) : ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని ఎరువులు, పురుగు మందుల షాపులో భారీ స్థాయిలో కల్తీ పొటాషియం నిల్వలు బయటపడ్డాయి. ప్రతిసారి మేము గోడౌన్ స్టాక్ రిజిస్టర్ తనిఖీ చేస్తున్నాం అని చెప్పుకుంటున్న అధికారులు.. ఈ కల్తీ పొటాషియంను ఎందుకు కనిపెట్టలేకపోయారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయినా అధికారులకు తెలియకుండానే ఇంత భారీ ఎత్తున కల్తీ జరుగుతుందా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. కల్తీ ఎరువులను రైతు కనిపెట్టేదాకా అధికారులు పట్టుకున్న దాఖలాలు తక్కువనే అని అంటున్న ప్రజలు. ఆ తర్వాత అధికారులు రావడం షాపు సీజ్, పంచనామా చేయడం, నామ మాత్రపు కేసులతో సరిపుచ్చటం పరిపాటి అవుతుందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సత్తుపల్లి మండల పరిధిలోని తాళ్ళమడ గ్రామానికి చెందిన ఓ రైతు పామాయిల్ సాగుకు అవసరమైన పొటాషియం, మెగ్నీషియం బస్తాలను పట్టణంలోని ఓ డీలర్ వద్ద కొనుగోలు చేశాడు. ఆ ఎరువులను డ్రిప్ సహాయంతో పామాయిల్ చెట్లకు వేయటానికి ప్రయత్నించగా పొటాషియం అంతా కూడా ఇసుక రూపంలో బయటకు రావడంతో అవాక్కయ్యాడు. దీంతో ఎరువులో కల్తీ జరిగిందని గ్రహించి రైతు.. సదరు డీలర్ కు ఫోన్ చేసి విషయం చెప్పాడు. ఈ క్రమంలో ఆ డీలర్ తప్పు జరిగిందని, ఈ విషయాన్ని బయటకు చెప్పవద్దని అనడంతో ఆగ్రహించిన రైతన్న.. తన లాగే మరొకరికి అన్యాయం జరగకూడదనే కారణంతో పోలీస్, మీడియాను ఆశ్రయించాడు. వారు సంబంధిత గోడౌన్‌ను సోదా చేయగా 173 కల్తీ పోటాష్ సంచులను గుర్తించారు. వీటిని వ్యవసాయ అధికారుల సమక్షంలో పంచనామా జరిపారు. అనంతరం దోషులను శిక్షించే విధంగా చర్యలు తీసుకుంటామని అగ్రికల్చర్ ఏడీ నరసింహ తెలిపారు. ఈ తనిఖీలో సత్తుపల్లి ఏవో శ్రీనివాస్, విఎమ్ బంజర్ ఏవో, ఏఈవోలు స్వాతి, గీతాశ్రీలు పాల్గొన్నారు.