మావోయిస్ట్ కీలక నాయకురాలు నర్మద మృతి
దిశ, తెలంగాణ బ్యూరో: సుదీర్ఘకాలం పాటు మావోయిస్టు పార్టీలో వివిధ స్థాయిల్లో- Latest Telugu News
దిశ, తెలంగాణ బ్యూరో: సుదీర్ఘకాలం పాటు మావోయిస్టు పార్టీలో వివిధ స్థాయిల్లో పనిచేసిన నిర్మల అలియాస్ నర్మద బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడి ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. విప్లవ రాజకీయాల పట్ల ఆకర్షితురాలై 1980వ దశకంలో అప్పటి పీపుల్స్ వార్ పార్టీలో చేరిన నర్మద కొంతకాలం పట్టణ ప్రాంతాల్లో టెక్నికల్ పనిలో పాలుపంచుకున్నారు. ఆ తర్వాత 1990వ దశకం ప్రారంభంలో నలభై ఏళ్ళ వయసులో దండకారణ్యంలో సాయుధ దళాల్లో చేరారు. దళసభ్యురాలిగా గడ్చిరోలి జిల్లాలోని ఆదివాసీ ప్రజల మధ్య సాయుధ జీవితాన్ని ప్రారంభించి 2018 వరకూ డివిజనల్ కమిటీ సభ్యురాలిగా, జిల్లా కార్యదర్శిగా, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలిగా, సెక్రటేరియట్ మెంబర్‌గా వివిధ రకాల బాధ్యతలను నిర్వర్తించారు.
దాదాపు 35 సంవత్సరాలకు పైగా దండకారణ్యంలో సాయుధ దళాల్లో పనిచేసిన నర్మద దాదాపు ఇరవై ఏళ్ళ పాటు తీవ్ర నిర్బంధం మధ్యనే విప్లవోద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. మహారాష్ట్రకు చెందిన సీ-60 ప్రత్యేక పోలీసు బెటాలియన్ దాడులను సైతం ఎదుర్కొన్నారు. నిర్బంధానికి భయపడి దళసభ్యులు ప్రభుత్వానికి లొంగిపోయినా నర్మద మాత్రం మరింత రాటుదేలారు. నిప్పులు చెరిగే నిర్బంధం నడుమనే ఆదివాసీ మహిళా ఉద్యమాన్ని బలోపేతం చేశారు. రాజకీయంగా, సైనికంగా సాయుధ దళాలకు నాయకత్వం వహించారు. ఈ క్రమంలోనే 2018లో అనారోగ్యానికి గురయ్యారు. వైద్య చికిత్స కోసం హైదరాబాద్ నగరానికి వచ్చిన నర్మదకు బ్రెస్ట్ క్యాన్సర్ నిర్ధారణ అయింది. చికిత్స పొందుతున్న క్రమంలోనే సమాచారం అందుకున్న మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. కోర్టు ఉత్తర్వులతో హాస్పైస్ కేర్ సెంటర్‌లో ఏడాది కాలంగా చికిత్స పొందుతూ ఏప్రిల్ 9న కన్నుమూశారు.
సాయుధ పోలీసు దాడులను విజయవంతంగా తిప్పికొట్టిన నర్మద చివరకు క్యాన్సర్ వ్యాధిని మాత్రం జయించలేకపోయారు. ఆమె మృతి పట్ల మావోయిస్టు పార్టీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. ఆమెతో అనుబంధం ఉన్న నాయకులు విప్లవోద్యమంలో ఆమె పోషించిన పాత్రను నెమరువేసుకున్నారు. దండకారణ్య విప్లవోద్యమంలో నర్మదను ఒక వేగు చుక్కగా ప్రజలు, పార్టీ కార్యకర్తలు పిలుచుకునేవారు. ఆమె భర్త సత్యనారాయణ ప్రస్తుతం మహారాష్ట్ర జైల్లో ఉన్నారు.