అంతరిక్షంలోకి టర్కీ కబాబ్..పైకెళ్లిన తర్వాత ఇలా అయ్యింది..?! (వీడియో)
హారిజోన్ కనిపించేంత వరకూ ప్రయాణించింది. Man Tries To Send Kebabs To Space.
దిశ, వెబ్‌డెస్క్ః ఆది మానవుడి నుండి ఆధునిక మానవుడి వరకూ అన్ని యుగాల్లోనూ అంతరిక్షం అంటే అత్యంత ఆసక్తి కనిపిస్తుంది. ఇలా అంతరిక్షమంటే అమితమైన ఆసక్తి ఉన్న టర్కీలోని ఒక కబాబ్ ఔత్సాహికుడు తాను వండిన మాంసం వంటకాన్ని అంతరిక్షంలోకి పంపడానికి ప్రయత్నించాడు. మొదటి మానవసహిత అంతరిక్ష విమానం 61వ వార్షికోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాడు. అయితే, దీనికి కబాబ్‌ను ఎందుకు ఎంచుకున్నాడో తెలియదు. ఆ వ్యక్తి చేసిన ప్రయత్నం విఫలమైనప్పటికీ, ఈ వేడుకకు సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.
వీడియోలో, ఒక పెద్ద హాట్ ఎయిర్ బెలూన్‌కి కొంతమంది వ్యక్తులు కబాబ్‌ను కట్టి వదులుతుంటారు. అంతరిక్షంలోకి వెళ్లే దాని ప్రయాణం కనిపించడానికి వీలుగా బెలూన్‌కు కెమెరా అమర్చి ఉంటుంది. ఇది కబాబ్ పెట్టిన ప్లేట్‌తో పాటు స్పేస్‌ను కూడా చూపిస్తుంది. ఇక, ఈ కబాబ్ భూమి పైనుండి అంతరిక్షంలోకి వెళ్లి, హారిజోన్ కనిపించేంత వరకూ ప్రయాణించింది. కొంత దూరం తర్వాత అది కిందకు దిగిపోతూ ఉంటుంది. చివరకు సముద్రంలో పడిపోతుంది. అనుకున్న మిషన్ విఫలమైనప్పటికీ, మంచి ప్రయత్నం జరిగిందని అందరూ సంతోషిస్తారు.
ఏప్రిల్ 12న యాసర్ ఐడిన్ అనే వ్యక్తి స్ట్రాటో ఆవరణలోకి కబాబ్‌ను ప్రయోగించాడని టర్కీ దినపత్రిక డైలీ సబా ఈ వార్తను ప్రచురించింది. ఆకాశంలోని అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునేలా ప్రత్యేక పెట్టెలో కబాబ్‌ను ఉంచినట్లు, ఆ పెట్టె హీలియం బెలూన్‌కు అమర్చినట్లు అందులో తెలిపారు. ఇక, ఏప్రిల్ 12, 1961, సోవియట్ వ్యోమగామి యూరి గగారిన్ అంతరిక్షంలోకి వెళ్లి, భూమి చుట్టూ ప్రదక్షిణ చేసిన మొదటి వ్యక్తిగా గుర్తింపు పొందిని విషయం తెలిసిందే. 27 ఏళ్ల గగారిన్, వోస్టాక్ 1 అనే మొదటి మానవ అంతరిక్షయానాన్ని ఒంటరిగా నిర్వహించి, చరిత్రకెక్కాడు.