MP BOORA : డెమోలిషన్ మ్యాన్ సీఎం రేవంత్ రెడ్డి : మాజీ ఎంపీ బూర
సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని డెమోలిషన్ మ్యాన్(Demolition Man కూల్చివేతల మనిషి)గా అభివర్ణిస్తూ బీజేపీ నేత, మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్(Boora Narsayya Goud)రేవంత్ ఫోటోతో కూడిన పోస్టర్ విడుదల చేశారు.
దిశ, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని డెమోలిషన్ మ్యాన్(Demolition Man కూల్చివేతల మనిషి)గా అభివర్ణిస్తూ బీజేపీ నేత, మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్(Boora Narsayya Goud)రేవంత్ ఫోటోతో కూడిన పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా బూర మాట్లాడుతూ స్వరాష్ట్రంలో తెలంగాణ ప్రజల పరిస్థితి బీఆర్ఎస్ పాలన నుంచి కాంగ్రెస్ పాలనలోకి వచ్చాకా పెనం నుంచి పోయ్యిలో పడ్డట్టు అయ్యిందన్నారు. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలలో గ్యారంటీల హామీలతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారన్నారు. మార్పు రావాలంటే కాంగ్రెస్ రావాలని చెప్పి, దేవుళ్ల మీద ఒట్టేసి అధికారంలోకి వచ్చి ప్రజలను, దేవుళ్లను మోసం చేస్తున్నారన్నారు. మహాలక్ష్మీ రూ.2500 పథకం, రైతుభరోసా, పెరిగే పెన్షన్, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, తులం బంగారం సహా 420హామీలు, గ్యారంటీల ఊసు లేదన్నారు. ఆగస్టులో మొదలైన రుణమాఫీ ఇప్పటికి పూర్తి కాలేదన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో రియల్ ఎస్టేట్ పడిపోయిందన్నారు. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి డెమోలిషన్ మ్యాన్(కూల్చివేతల మనిషి)గా మారిపోయి కూల్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నాడని విమర్శించారు.
హైడ్రా, మూసీ ప్రక్షాళన, భూసేకరణ, రహదారుల పేరుతో , ఫార్మా కంపనీల పేరుతో కూల్చివేతలు, లాక్కోవడం చేస్తున్నారన్నారు. రేవంత్ రెడ్డి వెనుకబడిన, పేద మరియు మధ్యతరగతి వర్గాల ఇళ్లను కూల్చివేస్తాడని, కాంగ్రెస్ ఉన్నతవర్గం, వారి బీఆర్ఎస్ మిత్రపక్షాలు, ఒవైసీ సోదరుల విశాలమైన అక్రమ నిర్మాణాలు, రాజభవనాల వంటి ఫామ్‌హౌస్‌లను మాత్రం కూల్చబోరని విమర్శించారు. మూసీ ప్రక్షాళనకు బీజేపీ వ్యతిరేకం కాదని, నిర్వాసితులకు న్యాయం చేయాలన్నదే మా డిమాండ్ అన్నారు. కాంగ్రెస్ మూసీ ప్రక్షాళన చేపట్టినా పూర్తి చేసేది బీజేపీ తెలంగాణ ప్రభుత్వమేనన్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి నేపథ్యంలో మూసీ ప్రక్షాళన కంటే ముందుగా కాంగ్రెస్ ఎన్నికల హామీలు అమలు చేస్తే మంచిదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి కుల గణన పూర్తికాగానే దమ్ముంటే 42శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పించి స్థానిక సంస్థలు ఎన్నికలు జరుపాలన్నారు. హర్యానాలో, మహారాష్ట్రలో బీజేపీ సర్వేలకు భిన్నంగా విజయం సాధించిందని, జార్ఖండ్, జమ్మూ కశ్మీర్ లలో ఓటింగ్ శాతం పెరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీ హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్, జమ్మూ కశ్మీర్లలో కలిపి 50సీట్లు కూడా గెలవలేదన్నారు. కాంగ్రెస్, రాహుల్ గాంధీ నాయకత్వంపై ప్రజలకు విశ్వాసం లేదన్నారు. తెలంగాణ ప్రజలు బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కోసం ఆశగా ఎదురుచూస్తున్నారని, రానున్న అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా బీజేపీని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.