PCC chief: ఇథనాల్ పరిశ్రమ తలసాని కొడుకుది.. బీఆర్ఎస్ హాయంలోనే అన్ని అనుమతులు: పీసీసీ చీఫ్
దిలావర్ పూర్ ఇథనాల్ పరిశ్రమల విషయంలో బీఆర్ఎస్ కు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సవాల్ విసిరారు.
దిశ, డైనమిక్ బ్యూరో: నిర్మల్ జిల్లా దిలావర్ పూర్ లో ఇథనాల్ పరిశ్రమకు పర్మిషన్ ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీనే అని ఇప్పుడు ఏమీ తెలియదన్నట్లుగా నటిస్తూ ఆ పార్టీ రైతులు రెచ్చగొడుతున్నదని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇథనాల్ పరిశ్రమ (Ethanol Industry) విషయంలో మాట్లాడటానికి కేటీఆర్ కు సిగ్గుండాలన్నారు. కేటీఆర్ మంత్రిగా, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ పరిశ్రమకు అనుమతులు ఇవ్వలేదా అని నిలదీశారు. బీఆర్ఎస్ నేతలు దిలావర్ పూర్ (Dilawarpur) రండి.. రైతుల మధ్యే తేల్చుకుందామని చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. మా ప్రభుత్వం గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు లేదని మండిపడ్డారు.
నిర్మల్ ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాలని, బీఆర్ఎస్ (BRS) నాయకులను నమ్మొద్దు అని విజ్ఞప్తి చేశారు. ఇథనాల్ పరిశ్రమకు 2023 లోపే అన్ని అనుమతులు వచ్చాయన్నారు. ఇది కేటీఆర్ (KTR) ప్రాజెక్టు అని, కేటీఆర్ సంబంధంతోనే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు సాయికిరణ్ యాదవ్ డైరెక్టర్ గా ఉన్న కంపెనీకి అక్కడ అనుమతులు ఇచ్చారన్నారు. అన్ని రకాలుగా రైతులను ముంచారని మండిపడ్డారు. అక్కడున్న పూర్వపరాలను పరిశీలించాక ఇథనాల్ పరిశ్రమ విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. కేంద్రం మూడు వ్యతిరేక చట్టాలను తీసుకువస్తే వాటిని భుజాన వేసుకు మోసింది బీఆర్ఎస్ అన్నారు. వెనుగబడిన లగచర్లలో ఇండస్ట్రియల్ పార్కు తీసుకువస్తుంటే పసలేని ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇటువంటి విమర్శలతో బీఆర్ఎస్ కు తాత్కాలికంగా ఆనందం ఉన్నా దీర్ఘకాలంలో ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు.