Deputy CM Bhatti:‘బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు’.. డిప్యూటీ సీఎం భట్టి సెన్సేషనల్ కామెంట్స్

కేటీఆర్ భ్రమలో బతుకుతున్నాడని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విమర్శించారు.

Update: 2024-11-27 15:21 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కేటీఆర్ భ్రమలో బతుకుతున్నాడని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విమర్శించారు. కాంగ్రెస్ ను ఏమీ చేయలేరని నొక్కి చెప్పారు. కాంగ్రెస్ ను కూకటి వేళ్లతో పీకుతామని కేటీఆర్ విచిత్రంగా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. ఆయన కాలం చెల్లిపోయిందని, కాంగ్రెస్ ను టచ్ చేయలేరని సవాల్ విసిరారు. బుధవారం ఆయన గాంధీ భవన్ లో మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. పార్టీలోకి కొత్త నేతలు వచ్చినప్పుడు కాస్త డిస్టబెన్స్ సహజమేనని వివరించారు. కానీ సమన్వయం చేస్తూ ముందుకు సాగుతామన్నారు. ఎక్కడ పార్టీకి డ్యామేజ్ జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని భట్టి వివరించారు. ప్రతిపక్ష పార్టీ సభ్యులుగా అధికార పార్టీతో కలవడం సహజమేనని చెప్పారు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి తన ప్లే ను రోల్ చేయాలని కోరారు.

బీజేపీ మంత్రిని ఓడించాం..

దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరుగుతోందన్నారు. బీజేపీ డౌన్ ట్రెండ్ స్టార్ట్ అవుతుందని వివరించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచారని వివరించారు. మధ్యప్రదేశ్లో బీజేపీ మంత్రిని కాంగ్రెస్ అభ్యర్థి ఓడించారని గుర్తు చేశారు. రైతు భరోసా ఇది విధానాలపై కసరత్తు జరుగుతోంది, రైతు భరోసా ఉంటుందని స్పష్టం చేశారు. కేటీఆర్ గత కొద్ది రోజులుగా ఏం మాట్లాడుతున్నారో, ఎందుకు మాట్లాడుతున్నారు అర్థం కావడం లేదని, సీఎంను, ప్రభుత్వాన్ని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని అన్నారు. తమ ముఖ్యమంత్రి, ప్రభుత్వం ఏం తప్పు చేసిందని ఆయన విమర్శిస్తున్నారని నిలదీశారు. తాము బీఆర్ఎస్ తరహాలో గడీల పాలన చేయలేదని, ప్రజల కోసం, తమ ద్వారాలు తెరిచే ఉంటాయన్నారు. ఈ రాష్ట్రంలో భావ స్వేచ్ఛ, అందరికీ స్వతంత్రాన్ని ఇచ్చి ప్రజా ప్రభుత్వం ముందుకు పోతుందన్నారు. దళితులు, గిరిజనులకు మూడు ఎకరాల భూమి ఇస్తామని చెప్పి, పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పరిపాలించిన వారు ఎంతమందికి భూ పంపిణీ చేశారని ప్రశ్నించారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చి, ఒక్క ఉద్యోగం ఇవ్వలేని వారు మాట్లాడితే ఎలా అని మండిపడ్డారు. పది సంవత్సరాలపాటు మంత్రిగా పనిచేసిన కేటీఆర్ కు కనీస సంస్కారం ఉండాలని చురకలు అంటించారు. కలెక్టర్ ను సన్యాసి అంటే ఎలా.. అందుకే ఆయన మైండ్ సెట్ సరిగా లేదని భావిస్తున్నట్టు డిప్యూటీ సీఎం తెలిపారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక దాని తర్వాత మరొకటి నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్తుందన్నారు. మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కల్పించి వారి పక్షాన ప్రభుత్వం ప్రతి నెల రూ. 400 కోట్లు ఆర్టీసీకి చెల్లిస్తుందన్నారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తూ వారి పక్షాన ప్రభుత్వం నెలకు రూ. 150 కోట్లు చెల్లిస్తుందన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు త్వరలోనే భూమి పూజ చేస్తామన్నారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 15 రోజుల్లోనే రైతు రుణమాఫీ కింద రూ. 18 వేల కోట్లు రైతుల ఖాతాలో జమ చేశామన్నారు. రేషన్ కార్డు ఉన్న కుటుంబాల అందరికీ రెండు లక్షల లోపు రుణమాఫీ జరిగిందన్నారు. కుటుంబాల వారిగా రేషన్ కార్డు లేక పొరపాట్లు ఉంటే సర్వే చేసి వారికి రైతు రుణమాఫీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. గత 10 సంవత్సరాల పాటు రేషన్ కార్డులు లేకుండా ప్రజలు ఇబ్బంది పడ్డారని, వాటిని ప్రక్షాళన చేసి కార్డులు ఇవ్వబోతున్నామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితిలో ఆర్థిక వ్యవస్థ ఉన్న, తాము 15 రోజుల్లోనే రైతులకు రూ. 18 వేల కోట్లు జమ చేశామన్నారు.10 సంవత్సరాలలో ఈ రాష్ట్రం పై అప్పుల భారాన్ని మోపారన్నారు. స్వేచ్ఛగా బతికిన తెలంగాణను బందీ చేశారన్నారు. ప్రోగ్రెసివ్ థింకింగ్, వెల్ఫేర్, డెవలప్మెంట్ అనే మూడు అంశాలతో ముందుకు వెళుతున్నామన్నారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కోసం ఒక్క సంవత్సరమే రూ.5 వేల కోట్లు ఖర్చు పెడుతున్నామన్నారు.

Tags:    

Similar News