దివ్యంగులు రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు ప్రారంభించిన మంత్రి సీతక్క
గచ్చిబౌలి స్టేడియంలో వికలాంగుల రాష్ట్ర స్థాయి గేమ్స్, స్పోర్ట్స్ మీట్ ను తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్క ప్రారంభించారు.
దిశ, వెబ్‌డెస్క్: గచ్చిబౌలి స్టేడియంలో వికలాంగుల రాష్ట్ర స్థాయి గేమ్స్, స్పోర్ట్స్ మీట్ ను తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్క ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పారా ఒలంపిక్స్‌లో మెడల్ సాధించి.. దేశ ఔన్నత్యాన్ని, ప్రపంచానికి చాటిన దీప్తి గురించి ప్రస్తావించారు. శివసేన రెడ్డి ప్రత్యేక చొరవతో సీఎం దృష్టికి తీసుకువెళ్ళి దీప్తీకి వరంగల్‌లో ఐదు వందల గజాల ఇంటి స్థలం కోటి రూపాయలను ప్రభుత్వం తరపున అందించినట్లు తెలిపారు. నెల రోజుల్లో గ్రూప్ 2 ఉద్యోగం కూడా ప్రభుత్వం ఇవ్వనుందని స్పష్టం చేశారు. అలాగే ప్రతి ఒక్కరూ తమకు ఉన్న వైకల్యాన్ని దురదృష్టంగా భావించకుండా.. మనలోని ప్రతిభతో పట్టుదలగా ప్రయత్నం చేయాలని.. డిసెంబర్ 3న ప్రపంచ వికలాంగుల దినోత్సవ ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకుందామని తెలిపారు. వైకల్యం ఉన్నంత మాత్రన ఎక్కడా కూడా మనం తక్కువ కాదని నిరూపించిన వనిత దీప్తీ అని కొనియాడారు. ఓటములు అనేక గుణ పాఠాలు నేర్పుతాయని ఓటమితో కుంగిపోవద్దని.. గెలవగానే నన్ను మించిన వాళ్ళు ఎవరూ లేరని పొంగిపోవద్దన్నారు. 33 జిల్లాల నుంచి అధికారులు మిమ్మల్ని ఇక్కడికి తీసుకు వచ్చి ఈ పోటీలను ఘనంగా నిర్వహిస్తున్నారని.. ఆత్మ విశ్వాసంతో ముందుకు వెళ్ళాలని ఈ క్రీడల్లో పాల్గొంటున్న అందరికీ నా ఆల్ ది బెస్ట్ అంటూ మంత్రి సీతక్క తన సమావేశాన్ని ముగించారు.