నాణ్యత ప్రమాణాలు పాటించాలి : కలెక్టర్ ప్రతీక్ జైన్
బొంరాస్ పేట్ మండలంలోని తుంకిమెట్ల పాఠశాలను బుధవారం
దిశ,బొంరాస్ పేట్ : బొంరాస్ పేట్ మండలంలోని తుంకిమెట్ల పాఠశాలను బుధవారం వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.వంటగదిని, భోజనానికి ఉపయోగించే బియ్యాన్ని పరిశీలించారు.విద్యార్థులకు మధ్యాహ్న భోజనానికి వండిన వంటలను పరిశీలించారు.విద్యార్థులు, ఉపాధ్యాయులు,అధికారులతో కలిసి,కలెక్టర్ స్వయంగా కూర్చొని,సహపంక్తి భోజనం చేశారు.భోజనం మంచిగా ఉందని,రోజు ఇదేవిధంగా ఉండాలని సంబంధిత అధికారులకు సూచించారు. భోజనం ఎలా ఉందని, విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.నాణ్యత ప్రమాణాలు పాటించాలన్నారు.
విద్యార్థులకు అందిస్తున్న ఆహారం విషయంలో రుచి,శుభ్రత పాటించి, జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉండే విధంగా పర్యవేక్షణ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.నాణ్యత ప్రమాణాలను తప్పకుండా పాటిస్తూ,పప్పు,కూరగాయలు, ఆకుకూరలను వండాలన్నారు. అంతకుముందు బొంరాస్ పేట్ మండల కేంద్రంతో పాటు,మెట్లకుంట,బురాన్ పూర్ గ్రామలలో సన్న,దొడ్డు రకాల వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు.రైతుల నుండి ఇప్పటివరకు సేకరించిన ధాన్యం నిల్వల గురించి కేంద్రాల నిర్వాహకులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.రైతుల సౌకర్యార్థం కేంద్రాలలో అందుబాటులో ఉంచిన సదుపాయాలను పరిశీలించారు.కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చిన రైతులను పలకరించి, కొనుగోలు కేంద్రాల్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా?అని ఆరా తీశారు.రైతుల సౌకర్యార్థం కేంద్రాల్లో అన్ని సదుపాయాలను అందుబాటులో ఉంచాలని, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు.
అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పని చేస్తూ,ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తి స్థాయి లక్ష్యానికి అనుగుణంగా సాఫీగా సాగేలా కృషి చేయాలని అన్నారు. రైతులు ధాన్యం తెచ్చిన వెంటనే తూకం వేయించి, లారీలలో లోడ్ చేసి,నిర్దేశిత రైస్ మిల్లులకు పంపించాలని, మిల్లుల వద్ద ధాన్యం అన్ లోడింగ్ వెంటవెంటనే జరిగేలా, పర్యవేక్షణ జరపాలన్నారు. వరి కొనుగోలు పూర్తి అయిన తక్షణమే డేటా ఎంట్రీ పూర్తి చేసి,రైతుల ఖాతాల్లోకి బోనస్ తో,కలిపి డబ్బులు జమ అయ్యేలా చూడాలన్నారు.అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో
సామాజిక,ఆర్థిక,రాజకీయ, విద్యా,ఉపాధి,కులగణన, సమగ్ర సర్వే ఆన్ లైన్ డేటా నమోదు ప్రక్రియను పరిశీలించారు.ఎలాంటి తప్పులకు తావు లేకుండా,ప్రతి కుటుంబ వివరాలను నమోదు చేయాలని సూచించారు.డేటా ఆపరేటర్లు తప్పులు లేకుండా ఎంట్రీ చేయాలని,డేటా ఎంట్రీ చేసేటప్పుడు ఎన్యుమరేటర్ తప్పని సరిగా దగ్గర ఉండి, నమోదు చేయించాలని సూచించారు.సర్వే డేటా ఎంట్రీ లో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ప్రతి కుటుంబ వివరాలను క్షుణ్ణంగా, సజావుగా ఆన్లైన్ లో నమోదు చేయాలని డేటా ఆపరేటర్లకు దిశ నిర్దేశం చేశారు.ఈప్రక్రియ పై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై అధికారి మోహన్ బాబు, తహసీల్దార్ పద్మావతి, ఎంపీడీవో వెంకన్న గౌడ్,ఎంఈవో ఎన్.హరిలాల్,ఏంపివో మహేష్ కుమార్,వ్యవసాయ అధికారులు,కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు,రైతులు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.