రానున్న రోజుల్లో మనదే అధికారం : మాజీ ఎమ్మెల్యే

ప్రతిపక్షంలో ఉన్నా, ప్రజల పక్షాన న్నే పనిచేయాలని

Update: 2024-11-27 10:56 GMT

దిశ,షాద్ నగర్ : ప్రతిపక్షంలో ఉన్నా, ప్రజల పక్షాన న్నే పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బుధవారం షాద్ నగర్ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన నియోజకవర్గ కార్యకర్తల, నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతిపక్షంలో ఉన్నా మన ధ్యాసను మర్చిపోయి ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు మన వంతుగా కృషి చేయాలని, ప్రభుత్వ వైఫల్యాలను ఎక్కడికక్కడ ఎండగడుతూ ప్రజల పక్షాన నిలవాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని, ఇకపై ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మే స్థితిలో లేరనే విషయాన్ని పార్టీ శ్రేణులు గ్రహించాలని సూచించారు.

ఇప్పటికీ రైతు భరోసా, తులం బంగారం, విద్యార్థులకు ఉపకార వేతనాలు, మహిళలకు పింఛన్లు, వృద్ధులకు పింఛన్లు పెంపు వంటి పథకాలు అమలుకు ఆమడ దూరంలో ఉన్నాయని, రుణమాఫీపై గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం , ప్రభుత్వ మంత్రులే పూర్తిస్థాయిలో రుణమాఫీ కాలేదని చెప్పుకోవడం దేనికి నిదర్శనమో మనమందరం గ్రహించాలని అన్నారు. ప్రభుత్వ పని తీరును గ్రామీణ ప్రాంత ప్రజలు వ్యతిరేకిస్తున్నారనే విషయం అందరికీ అర్థమవుతుందని, ఇకపై కాంగ్రెస్ పార్టీని నమ్మే స్థితిలో తెలంగాణ ప్రజలు లేరని అభిప్రాయపడ్డారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయఢంకా మోగిస్తామని, అందుకు మనమందరం సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

అప్పటి కేసీఆర్ పాలన సంక్షేమ పథకాలను, నేడు అమలవుతున్న సంక్షేమ పథకాల ఫలాలను పోలుస్తూ ప్రజలకు వివరించాలని చెప్పారు. కచ్చితంగా రానున్న రోజుల్లో మనదే అధికారం అనే విషయాన్ని ప్రతి కార్యకర్త గుర్తుంచుకోవాలని, పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేయాలని కోరారు. పార్టీ అధిష్టానం పిలుపుమేరకు ఈనెల 29న జిల్లా కేంద్రాలలో నిర్వహించే దీక్షా దివస్ ను విజయవంతం చేసేందుకు గ్రామాల నుంచి తెలంగాణ వాదులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని కోరారు.


Similar News