రైతే రాజు కావాలన్నది కాంగ్రెస్ పార్టీ ధ్యేయం : మంత్రి తుమ్మల
రైతు లేనిదే దేశం లేదు కష్టపడి వ్యవసాయం చేస్తున్న రైతు రాజు కావాలని
దిశ,షాద్ నగర్ : రైతు లేనిదే దేశం లేదు కష్టపడి వ్యవసాయం చేస్తున్న రైతు రాజు కావాలని కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో బుధవారం స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో స్థానిక వ్యవసాయ మార్కెట్ అభివృద్ధి కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవ సభకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ నాగేశ్వరరావు, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తదితరులు హాజరయ్యారు.మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గా సులోచన కృష్ణారెడ్డి, వైస్ చైర్మన్ గా మహమ్మద్ అలీ ఖాన్ బాబర్, మరి కొంతమంది మార్కెట్ డైరెక్టర్లుగా మంత్రి తుమ్మల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు.
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ 22 లక్షల మంది రైతులకు 18 వేల కోట్ల రూపాయలు చెల్లించడం జరిగిందని, ఇతర కారణాలతో ఆగిపోయిన రైతు రుణమాఫీలకు సంబంధించి త్వరలో పాలమూరులో జరగనున్న రైతు పండుగ కార్యక్రమం ద్వారా 3000 కోట్ల రూపాయలను మిగిలిన రైతాంగానికి రుణమాఫీ ద్వారా చెల్లించడం జరుగుతుందని అన్నారు.రీజినల్ రింగ్ రోడ్డు త్రిబుల్ ఆర్ వస్తే షాద్ నగర్ నియోజకవర్గంలో భూములు బంగారం అవుతాయని, ప్రాంత అభివృద్ధి కోసం కొందుర్గు మండల వ్యవసాయ నూతన మార్కెట్ కమిటీని ఏర్పాటు చేయాలని కోరారు.అదేవిధంగా ఈ ప్రాంతంలో రైతుల శ్రేయస్సు దృష్ట్యా కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు వినతిపత్రం అందజేయడంతో మంత్రి వెంటనే సభలో స్పందించారు.
ఇంత గొప్ప అభివృద్ధి సాధిస్తున్న ఈ ప్రాంతాన్ని తను ప్రత్యేక దృష్టితో చూస్తానని వెంటనే కొందూర్గు వ్యవసాయ మార్కెట్ కమిటీని నూతనంగా ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.దీంతో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ధన్యవాదాలు తెలిపారు.మార్కెట్లో దళారీ వ్యవస్థను నిర్మూలించాలని రైతు నుండి మొదలుకొని హమాలీలు అందరికీ న్యాయం జరిగేలా చూడాలని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు న్యాయం జరుగుతుందని. అదేవిధంగా కమిటీ సభ్యులకు రైతులకు అందుబాటులో ఉండాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు ప్రతాప్ రెడ్డి, భీశ్వ కృష్ణయ్య, మాజీ జడ్పీటీసీలు తాండ్ర విశాల శ్రావణ్ రెడ్డి, వెంకట్రాంరెడ్డి, ఆయా మండలాల పార్టీ మండల అధ్యక్షులు సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.నూతన పాలక వర్గం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సులోచన రెడ్డి,వైస్ చైర్మన్ మహమ్మద్ అలీ ఖాన్ బాబర్,కమిటీ మెంబర్లు కొర్ర రవి, బాల్ షా రెడ్డి,చాకలి నరసింహులు,జానంపేట సురేష్,వెంకట్ నరసింహారెడ్డి, చిత్ర గారి మల్లయ్య,చేదురువల్లి భాస్కర్ గౌడ్,కరుణాకర్,వెంకటరెడ్డి,భరత్,సందీప్ కుమార్,నవీన్ కుమార్ తదితరులు పాల్గోన్నారు.