దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ బీమా సంస్థ ఎల్ఐసీ ఐడీబీఐ బ్యాంకులో తన మొత్తం వాటాను విక్రయించే అవకాశం లేదని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ ఎంఆర్ కుమార్ అభిప్రాయపడ్డారు. ఎల్ఐసీ తన బీమా సేవలను మార్కెటింగ్ చేసేందుకు బ్యాంకు నెట్‌వర్క్‌ను ఉపయోగిస్తుందని సోమవారం ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. ఎల్ఐసీ ఐపీఓ వస్తున్న తరుణంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. తాను వ్యక్తిగతంగా ఐడీబీఐ బ్యాంకులో ఎల్ఐసీకి కొంత వాటా ఉండాలని భావిస్తున్నాను.
దీనివల్ల ప్రయోజనాలున్నాయి. బీమా విభాగం వృద్ధికి బ్యాంకు నెట్‌వర్క్ సహాయపడుతుందన్నారు. గత ఏడాది డిసెంబర్ చివరి నాటికి ఐడీబీఐ బ్యాంకు రూ. 2.9 లక్షల కోట్ల ఆస్తులు, దేశవ్యాప్తంగా 1,800 బ్రాంచ్‌లను కలిగి ఉంది. ఈ బ్యాంకులో ఎల్ఐసీకి 90 శాతం వాటా ఉంది. బ్యాంకు 2019లో అధిక మొండి బకాయిలతో నష్టాల్లో ఉన్నప్పుడు ఎల్ఐసి కొత్తగా మూలధన సాయం చేసి వాటాను సొంతం చేసుకుంది. ఆ తర్వాతి పరిణామాల్లో కేంద్రం ఐడీబీఐలో ప్రభుత్వంతో పాటు ఎల్ఐసీ వాటాను తగ్గిస్తున్నట్టు పేర్కొంది.
ఇక, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పీఎంజేజేబీవై) చందాదారులు కూడా ఎల్ఐసీ పాలసీదారుల కోసం రిజర్వ్ చేసిన ప్రయోజనాలను పొందేందుకు అర్హులవుతారని కుమార్ స్పష్టం చేశారు. ఈ పథకం ఎల్ఐసీ ద్వారానే అందించబడుతోంది కాబట్టి సంస్థ ఐపీఓ పాలసీదారులకు ఉండే ప్రయోజనాలను వీరు కూడా పొందవచ్చని కుమార్ పేర్కొన్నారు.
కాగా, ఎల్ఐసీ ఇటీవల సెబీకి ఇచ్చిన డ్రాఫ్ట్ ఫైల్ ప్రకారం.. ఎల్ఐసి తన పాలసీదారులకు 10 శాతం రిజర్వ్ చేసింది. డిస్కౌంట్ కూడా ఉండనున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ, దీనిపై ఇంకా స్పష్టత రాలేదు. అలాగే, ఎల్ఐసీ సంస్థ మెరుగైన మూల ధనాన్ని కలిగి ఉందని ఎంఆర్ కుమార్ చెప్పారు. ఐపీఓ తర్వాత ప్రభుత్వ వాటాపై పెట్టుబడిదారులు ఆందోళన పడొద్దని ఆయన అన్నారు. సంస్థ నిర్ణయాలను ఎల్ఐసి బోర్డు మాత్రమే తీసుకుంటుందని ఆయన వెల్లడించారు