నుదుట బొట్టుందని విద్యార్థిని బయటకు పంపిన కాశ్మీరీ టీచర్! (వీడియో)
దేశం ఎటుపోతే ఏముందిలే అనుకునే ధోరణే అందరిలోనూ నాటుకుపోయింది. J&K teacher Nisar Ahmad thrashes school students.
దిశ, వెబ్‌డెస్క్ః దేశం ఎటుపోతుందో తెలుసుకునే తీరిక సగటు సామన్య భారతీయుడికి లేదు, దేశం ఏమైపోతోంది అనే ధ్యాస బడా బిజినెస్ మ్యాన్లకు ఉండదు, దేశం ఎందుకిలా ఉందని ఆలోచించే ఓపిక రాజకీయ నాయకులకు రాదు. మొత్తంగా, దేశం ఎటుపోతే ఏముందిలే, మన పబ్బం గడుస్తుందిగా అనుకునే ధోరణే అందరిలోనూ నాటుకుపోయిందన్నట్లు ఉంది. అందుకే, మతానికిస్తున్న ప్రాధాన్యత మనుషులు సాటి మనిషికి ఇవ్వలేకపోతున్నారు. ఇలాంటి, దిగ్భ్రాంతికర పరిణామంలో, ఈమధ్య కర్నాటకలో జరిగినట్లే జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరి జిల్లాలో మరో దుర్మార్గమైన ఘటన చోటుచేసుకుంది. హిందూ కుటుంబానికి చెందిన విద్యార్థిని నుదుటిపై తిలకం పెట్టుకుని పాఠశాలకు వెళ్లడంతో నిసార్ అహ్మద్ అనే ఓ పంతులుగారు ఆమెను బయటకు పంపేశాడు.
'ఇంట్లో నవరాత్రి పూజలు నిర్వహిస్తున్నామని, పాప నుదుటిపై తిలకం ధరించి, స్కూలుకు వెళ్లిందని, దానికే కొట్టి, ఇంటికి పంపించేస్తారా' అని బాలిక తండ్రి ఆగ్రహం వ్యక్తం చేశాడు. సమాచారం తెలుసుకున్న రాజౌరి జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆదేశాల మేరకు నిసార్ అహ్మద్ అనే ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు అధికారులు. ఖదూరియన్ పంచాయత్‌లోని మిడిల్ స్కూల్‌లో ద్రమ్మన్‌కు చెందిన ఇద్దరు విద్యార్థినులను ఉపాధ్యాయుడు కొట్టినట్లు సోషల్ మీడియాలో వచ్చిన రిపోర్టులను పరిగణనలోకి తీసుకున్నట్లు ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పిల్లలను గాయపరచడం నేరంగా పరిగణించబడుతుందని, భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 323, 325, 352, 506 ప్రకారం సదరు వ్యక్తి శిక్షార్హుడని అందులో వెల్లడించారు. అదనంగా, జువెనైల్ జస్టిస్ (పిల్లల సంరక్షణ, రక్షణ) చట్టం, 2000లోని సెక్షన్ 23 ప్రకారం, "పిల్లలపై ఎవరైనా దాడి చేసినట్లయితే, అతను/ఆమెకు ఆరు నెలల వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించవచ్చు" అని పేర్కొన్నారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు నిసార్ అహ్మద్‌పై సస్పెన్షన్ వేటు పడుతున్నట్లు చెప్పారు.
ఇక, ఈ సంఘటన గురించి రాజౌరి సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మహ్మద్ అస్లాం చౌదరి మాట్లాడుతూ, "మేము ఈ సంఘటన గురించి విన్నాము. స్కూలు ఉపాధ్యాయుడు మైనర్ బాలికను కొట్టారని, అభ్యంతరకర పదాలు వాడారని మాకు ఫిర్యాదు అందింది. నిందితుడిపై కేసు నమోదు చేశాం. దర్యాప్తు ప్రారంభించాం" అన్నాడు.