ఎట్టకేలకు విధుల్లోకి ఐపీఎస్ అధికారి అభిషేక్ మొహంతి..
ఐపీఎస్ అధికారి అభిషేక్ మొహంతిని తెలంగాణ ప్రభుత్వం ఎట్టకేలకు విధుల్లోకి తీసుకుంది.
దిశ, డైనమిక్ బ్యూరో : ఐపీఎస్ అధికారి అభిషేక్ మొహంతిని తెలంగాణ ప్రభుత్వం ఎట్టకేలకు విధుల్లోకి తీసుకుంది. ఈ సందర్భంగా జీవో 583ను జారీ చేసినట్లు హైకోర్టులో ఏజీ నివేదించారు. అఖిల భారత సర్వీసు అధికారుల విభజనలో భాగంగా మొహంతిని కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించింది. ఏపీకి కేటాయించడాన్ని సవాల్ చేస్తూ కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్‌ను ఆశ్రయించిన అభిషేక్.. తనను తెలంగాణకు కేటాయించాలని కోరారు. అన్ని వాదనలు విన్న క్యాట్ మొహంతిని తెలంగాణకు కేటాయించాలని ఉత్తర్వులిచ్చింది. అయితే, ఏపీ రిలీవ్ చేసినప్పటికీ.. తెలంగాణ ప్రభుత్వం విధుల్లోకి తీసుకునేందుకు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదు. దీంతో మొహంతి ట్రైబ్యునల్ లో కోర్టు దిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. సీఎస్ తీరుపై ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు.. దీనిపై మరోసారి విచారణ జరిపింది. అభిషేక్ మొహంతిని విధుల్లోకి తీసుకుంటూ జీవో జారీ చేసినట్లు అడ్వకేట్ జనరల్ తెలపడంతో సీఎస్ వ్యక్తిగతంగా హాజరుకావాలన్న క్యాట్ ఉత్తర్వులను హైకోర్టు నిలిపివేసింది.