400 బిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని సాధించిన భారత్!
న్యూఢిల్లీ: తొలిసారిగా భారత్ ఎగుమతుల్లో రికార్డును సృష్టించింది. ..telugu latest news
న్యూఢిల్లీ: తొలిసారిగా భారత్ ఎగుమతుల్లో రికార్డును సృష్టించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఇంకా ఏడు రోజుల సమయం ఉండగానే నిర్దేశించిన లక్ష్యం 400 బిలియన్ డాలర్ల(రూ. 30.05 లక్షల కోట్ల) విలువైన ఎగుమతులను సాధించింది. భారత్ చరిత్రలో మొదటిసారిగా ఈ లక్ష్యాన్ని అధిగమించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో భారత ఎగుమతులు 298.1 బిలియన్ డాలర్ల(రూ. 22.75 లక్షల కోట్ల)తో పోలిస్తే ఈసారి ఏకంగా 37 శాతం పెరగడం విశేషం. కోవిడ్-19 సంక్షోభం వల్ల ఆర్థిక వ్యవస్థలో అనేక సవాళ్లు ఉన్నప్పటికీ, రికార్డు స్థాయిలో పెరుగుతున్న ముడి చమురు ధరల మధ్య మొదటిసారి అత్యధిక ఎగుమతులు నమోదవడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా రైతులు, ఎంఎస్ఎంఈ పరిశ్రమలు, ఉత్పత్తిదారులు, చేనేత కార్మికులు, ఎగుమతిదారులకు మోదీ కృతజ్ఞతలు చెప్పారు. ఆత్మ నిర్భర్ భారత్‌కి ఈ రికార్డు స్థాయి ఎగుమతులు చక్కని ఉదాహరణ అని మోదీ తెలిపారు. ఎగుమతులకు పవర్‌హౌస్‌గా మారేందుకు భారత్ ముందడుగు వేస్తోందని వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఓ ప్రకటనలో తెలిపారు.