రోడ్డు మీద ఉన్న సిమెంట్‌ పైపుల్లో నిద్రపోయాను.. కన్నీళ్లు పెట్టిస్తున్న బలగం వేణు ఎమోషనల్ కామెంట్స్

కమెడియన్ కమ్ డైరెక్టర్ వేణు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు.

Update: 2024-10-17 04:44 GMT

దిశ, వెబ్‌డెస్క్: కమెడియన్ కమ్ డైరెక్టర్ వేణు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఈయన ‘జబర్దస్త్’ షోలో వండర్ వేణుగా స్కిట్స్ చేసి తన కామెడీ, పంచ్‌లతో మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ షో నుంచి వైదొలిగాడు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో కమెడియన్ పాత్రల్లో నటించి మెప్పించాడు. అలా కమెడియన్ పాత్రల్లో మెప్పిస్తూ వేణు సడెన్‌గా డైరెక్షన్ ఫీల్డ్‌లోకి అడుపెట్టాడు. ఇక తెలుగు సినిమా చరిత్రలోనే ఓ క్లాసిక్‌గా మిగిలిపోయిన ‘బలగం’ వంటి చిత్రాన్ని తెరకెక్కించి దర్శకుడిగా తన ప్రతిభను నిరూపించుకున్నాడు. అయితే వేణు సినీ ఇండస్ట్రీలోకి రావడానికి చాలా కష్టపడ్డాడు.. ఇటీవల ఓ సందర్భంలో ఆయన తన సినీ రంగ ప్రవేశం గురించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.

ఆయన మాట్లాడుతూ.. “సినీ పరిశ్రమ మీద మక్కువతో ఇంట్లో చెప్పకుండా పారిపోయి హైదరాబాద్‌కు వచ్చాను. జేబులో రూ.275, బ్యాగులో రెండు జతల బట్టలు. ఇవే అప్పుడు నా ఆస్తిపాస్తులు. హైదరాబాద్‌‌కు వచ్చిన తరువాత ఎక్కడ ఉండాలో తెలియక మూడు రోజులు బస్టాండులోనే వున్నాను. ఛాయ్‌, డబుల్‌ రొట్టే మాత్రమే తినేవాడ్ని. ఇక అన్నపూర్ణ స్టూడియో అడ్రస్‌ కనుక్కొని అక్కడికి వెళ్లిపోయాను. అక్కడ ఆ గేటు ముందు చాలా మంది నాలాగా అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వాళ్ళే. అక్కడ ఆ స్టూడియో ముందు రోడ్డు మీద వున్న పైపుల్లో నిద్రపోయేవాడ్ని. మంగళవారం, శుక్రవారం పెద్దమ్మ గుడిలో అన్నదానాలతో ఆకలి తీర్చుకునేవాడిని. మిగతా రోజులు దాదాపు పస్తులే. ఉన్న రెండు జతల బట్టల్లో ఒకటి ఒంటి మీద, ఇంకోటి ఉతికి ఆరేసి ఉండేది.

ఇక టవలు, చెప్పులు మాత్రం దగ్గర్లో వుండే ఇసుకను తవ్వి అందులో పెట్టి పూడ్చే వాళ్లం. లేదంటే పడుకున్నప్పుడు దొంగలు ఎత్తుకెళ్లాతరనే భయం ఉండేది. ఒకరోజు అనుకోకుండా సెట్‌బాయ్‌గా అవకాశం వచ్చింది. ఆ తరువాత ఓ డైరెక్టర్‌ దగ్గర పనిచేశాను. అప్పుడే చిత్రం శ్రీను పరిచయమయ్యాడు. కొంతకాలం ఆయన దగ్గర టచప్‌ బాయ్‌గా చేశాను. తరువాత ‘జై’ సినిమాలో నటుడిగా అవకాశాలు వచ్చే దాకా ఎన్ని కష్టాలు చూడాలో అన్ని చూసేశాను. దర్శకుడు తేజకు అడిషన్‌ కోసం ఫొటోలు పంపడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు. అప్పుడు నా మిత్రుడు కొత్తపల్లి శేషు సహాయంతో ఫొటోలు పంపాను. ఆ తరువాత అడిషన్‌లో సెలక్ట్‌ కాగానే నాలుగు జతల బట్టలు కూడా కుట్టించి షూటింగ్‌కు పంపాడు. నా స్నేహితుడు శేషు చేసిన సహాయం జీవితాంతం మరచిపోలేను” అంటూ బలగం వేణు ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.


Similar News