కేటీఆర్ నమ్మించి నట్టేట ముంచిండు.. దళితుల ఆందోళన
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ తమను నమ్మించి నట్టేట ముంచాడంటూ సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ నగర్ కు చెందిన దళితులు ఆందోళనకు దిగారు.
దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ తమను నమ్మించి నట్టేట ముంచాడంటూ సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ నగర్ కు చెందిన దళితులు ఆందోళనకు దిగారు. జిల్లా కేంద్రంలోని నర్సింగ్ కాలేజ్ వద్ద గురువారం మొదటి బైపాస్ రోడ్డు పై బైఠాయించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుమారు 50 ఏళ్ల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల కోసం తమకు సుమారు 10 ఎకరాల భూమిని కేటాయించిందని, ఆ భూములను గత ప్రభుత్వం, అప్పటి మంత్రి, ప్రస్తుత సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ఆశ చూపి లాక్కున్నాడని ఆరోపించారు.
తీరా నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను గత ఐదేళ్లుగా తమకు ఇస్తామని ఆశ చూపి, ఇప్పుడు వాటిని దళితులకు కాకుండా ఇతరులకు అప్పగించారని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పటి అధికారుల అండదండతో మున్సిపల్ పాలకవర్గం డబుల్ ఇండ్లను అమ్ముకున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్పందించి అధికారులతో రీ సర్వే చేయించి, తమకు డబుల్ ఇళ్లను ఇచ్చి న్యాయం చేయాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.