అనుమానమే ఆయువు తీసిందా.. కట్టుకున్నదాన్ని కడతేర్చిన భర్త
దిశ, తాండూర్ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల కేంద్రంలోని లక్ష్మీ నగర్ కాలనీలో హోలీ
దిశ, తాండూర్ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల కేంద్రంలోని లక్ష్మీ నగర్ కాలనీలో హోలీ పండుగ వేళ దారుణం చోటుచేసుకుంది. భార్యను భర్త తీవ్రంగా కొట్టి చంపాడు. వాంకిడి సీఐ సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. కోరకంటి పోశం పలు గ్రామాల్లో డప్పు చాటింపు, కూలీ పని చేస్తూ భార్య కమల (50)తో లక్ష్మినగర్ కాలనీలో నివాసముంటున్నారు. వీరికి నలుగురు పిల్లలు కాగా, వాళ్లు వేర్వేరు చోట్ల నివాసం ఉంటున్నారు. గత కొంతకాలం నుండి భార్యపై పోశం అనుమానం పెంచుకుని ఇంటికి తాగి వచ్చి తరచూ గొడవ పడుతుండడంతో భార్య భర్తల మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. గురువారం రాత్రి కూడా ఇంటికి తాగి వచ్చి భార్యతో గొడవపడ్డాడు. ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోవడంతో భార్యను కింద పడేసి తలను నేలపై బాది హత్య చేశాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.