Miyawaki fForest:ప్రకృతి హారంగా 'మియావాకీ' ఫారెస్ట్!.. తక్కువ విస్తీర్ణంలో అడవులు పెంచే ఉత్తమ మార్గం

దిశ, ఫీచర్స్ : వాయు కాలుష్యం కారణంగా దక్షిణాసియా నగరాల్లో అకాల మరణాల సంఖ్య పెరిగింది.

Update: 2022-04-13 03:52 GMT

దిశ, ఫీచర్స్ : వాయు కాలుష్యం కారణంగా దక్షిణాసియా నగరాల్లో అకాల మరణాల సంఖ్య పెరిగింది. భారతదేశ వ్యాప్తంగానూ ఈ తరహా మరణాలు లక్షకు పైగా నమోదయ్యాయి. ఇక ప్రపంచంలోనే అత్యంత కాలుష్య రాజధానిగా ఢిల్లీ నాలుగోసారి టాప్ పొజిషన్‌లో ఉన్నట్లు వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ పేర్కొంది. అక్కడ గతేడాది కంటే దాదాపు 15% కాలుష్యం పెరిగిపోయింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం దేశమంతటా వాతావరణ మార్పు, గ్లోబల్ వార్మింగ్‌ ప్రభావాలను ఎదుర్కొంటున్నాం. ఈ పరిస్థితుల్లో సమస్త జీవకోటిని రక్షించగలిగేవి 'అరణ్యాలు' మాత్రమే. కలుషితమైన పట్టణ గాలి నుంచి క్షీణిస్తున్న జీవవైవిధ్యం వరకు ప్రతి సమస్యలకు మినీ ఫారెస్ట్ ఒక్కటే సమాధానం. కాగా తక్కువ విస్తీర్ణం గల నగరాల్లో ఇలాంటి అడవుల సృష్టికి 'మియావాకీ పద్ధతి' ఉత్తమమైంది. ఇంతకీ ఆ ప్రక్రియ ఏంటి? దానివల్ల జీవులకు కలిగే లాభాలేంటి? ప్రత్యేక కథనం మీకోసం.


తక్కువ స్థలంలోనే ఎక్కువ మొక్కలను ఫారెస్ట్ మాదిరిగా పెంచే జపాన్‌ పద్ధతిని 'మియావాకీ మెథడ్' అంటారు. జపాన్‌ వృక్ష శాస్త్రవేత్త అకీరా మియావాకీ ఈ విధానాన్ని కనుగొన్నందున ఈ పేరొచ్చింది. ఈ పద్ధతిలో మొక్కలు వేగంగా పెరగడమే కాక పచ్చదనంతో దట్టమైన అరణ్యాన్ని తలపిస్తాయి. కానీ నగరాల్లో వేలాదిగా చెట్లు నాటేందుకు అనువైన స్థలం దొరకడం కష్టం. దీనికి పరిష్కారంగానే 'మియావాకీ మెథడ్' ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇక మియావాకీ.. తన జీవిత కాలంలో జపాన్ నుంచి ఆగ్నేయాసియా, బ్రెజిల్, ఇండియా వరకు దాదాపు 1500 కు పైగా అడవులు సృష్టించాడు. కాగా మియావాకీ అడవులు.. ఇతర అడవుల కంటే ఎక్కువ జీవ వైవిధ్యానికి తోడ్పడతాయని నెదర్లాండ్స్‌లోని వాగెనింగెన్ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు.

ఎలా నాటుతారు?

మియావాకీ పద్ధతిలో స్థలాన్ని ఆదా చేసేందుకు మొక్కలను(స్థానిక జాతులు మాత్రమే) ఒకదానికొకటి దగ్గరగా నాటుతారు. దీంతో అవి సూర్యకాంతిని పొందడంలో పోటీపడి పెరుగుతాయి. తద్వారా సూర్యరశ్మిని భూమికి చేరకుండా నిరోధిస్తాయి. ఈ క్రమంలోనే నిటారుగా సాధారణం కంటే 30 రెట్లు దట్టంగా, 10 రెట్లు వేగంగా పెరుగుతాయి. ఇక సాంప్రదాయ పద్ధతిలో అడవిని సృష్టించేందుకు 200 నుంచి 300 ఏళ్లు పడితే.. మియావాకీ పద్ధతిలో కేవలం 20 నుంచి 30 ఏళ్లలోనే అడవిని సృష్టించగలం.

ప్రక్రియ ఎలా ఉంటుంది?

నేల నాణ్యత తో పాటు స్థానిక చెట్లను పరిశీలించి అందుకు తగ్గ మొక్కలను ఎంచుకోవాలి. ఆ తర్వాత మల్టీ-లేయర్డ్ ప్రక్రియ కోసం పొద పొర(6 ఫీట్), ఉప-చెట్టు(6 నుంచి 12 ఫీట్లు), చెట్టు(20 నుంచి 40 ఫీట్లు), పందిరి(40 ఫీట్ల పైన) వంటి పొరలు ఏర్పాటు చేసుకోవాలి. ఒక మీటరు లోతైన గొయ్యి తవ్వి, చదరపు మీటరుకు 3 నుంచి 5 దేశీయ మొక్కలు నాటాలి. అయితే మొక్కల మధ్య 60 సెం.మీ దూరాన్ని పాటించడంతో పాటు మొక్క కాండం చుట్టూ మట్టిని చదును చేయాలి. వంగిపోకుండా ఉండేందుకు సపోర్ట్‌గా భూమిలో కర్రలు పాతాలి. రోజుకోసారి నీళ్లు పోయడం తో పాటు మొదటి రెండేళ్ల వరకు కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి.

భారతదేశంలో..

తిరువనంతపురం నుంచి న్యూఢిల్లీ వరకు మియావాకీ పద్ధతిలో వందలాది మొక్కలు నాటారు. ఇప్పుడు చెన్నయ్ సిటీలోనూ 1,000 మినీ ఫారెస్ట్‌లు ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఇక దేశంలోనే అతిపెద్ద మియావాకీ ఫారెస్ట్ హైదరాబాద్‌ నగరంలో 10 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇక చిన్న పట్టణ కేంద్రాలైన తిరునలివెళ్లి పాఠశాలల్లో, తిరుచ్చిలోని దేవాలయాల ప్రాంతం సహా రోహ్‌తక్‌లోని జైలు చుట్టూ కూడా ఈ తరహాలో మొక్కలు పెంచారు. ఇక ముంబైలోని వెర్సోవా లో 7000 కు పైగా స్థానిక మొక్కలు నాటేందుకు ఇదే పద్ధతిని అవలంబించగా.. మియావాకీ మెథడ్ ఆధారంగా ముంబైలో ఇప్పటి వరకు 4 లక్షలకు పైగా దేశీయ మొక్కలు నాటడం విశేషం

ఉపయోగాలు ..

వాతావరణ మార్పులు సహా గ్లోబల్ వార్మింగ్ వంటి ప్రకృతి విపత్తులను నిరోధించడంలో చెట్లది కీలక పాత్ర. ఇవి పర్యావరణ వ్యవస్థను మెరుగుపరచడం తో పాటు సుస్థిర జీవనానికి దారితీస్తాయి. ఇక మినీ ఫారెస్ట్‌ల కారణంగా నగరాలు, పట్టణాల్లో 'లంగ్ స్పేస్' పెరిగి స్వచ్ఛమైన గాలి అందుతుంది. కర్బన ఉద్గారాలు తగ్గి, కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. పట్టణ ప్రదేశాల వాతావరణాన్ని పునరుద్ధరించగలవు. వన్యప్రాణులు సహా ఇతర ప్రాణులకు నిలయంగా మారి జీవవైవిధ్యానికి తోడ్పడతాయి.

మియావాకీ ప్రేరణతో..

2009లో బెంగళూరులోని టయోటా ఫ్యాక్టరీ క్యాంపస్‌లో అడవులు పెంచిన ఇంజనీర్‌ శర్మ.. ఆ తర్వాత తన పెరట్లోనే మైక్రో ఫారెస్ట్‌ ఏర్పాటు చేశాడు. ఈ క్రమంలోనే మినీ అడవులను సృష్టించే లక్ష్యంతో 2011లో ఉద్యోగానికి రాజీనామా చేశాడు. తన ప్రయాణంలో 44 నగరాల్లో 138 అడవులను స్థాపించి, ఈ ఉద్యమంలో చేరేలా అనేక మందిని ప్రేరేపించాడు. .

మనకు ఇది సరిపోలని పద్ధతి ..

మియావాకీ పద్ధతి ఖరీదైనదే కాక దాని ప్రయోజనాలు అస్పష్టంగా ఉన్నాయి. ఇవి పర్యావరణ పునరుద్ధరణ ప్రాథమిక సూత్రాలను ఉల్లంఘిస్తున్నాయి. గుజరాత్, రాజస్థాన్ లేదా దక్కన్ పీఠభూమిలోని శుష్క ప్రాంతం లో మియావాకీ అడవులను పెంచడం సమంజసం కాదు. అంతేకాదు సరైన చెట్లను ఎంచుకోకుంటే అది స్థానిక పర్యావరణ వ్యవస్థలను నాశనం చేస్తుంది. వాటిపై ఆధారపడిన మొక్కలు, జంతువులను ప్రమాదంలోకి నెట్టేస్తుంది. పైగా వీటిలో సహజ అడవుల్లో లభించే ఔషధ మొక్కలు ఉండవు. కానీ నగరాల్లో వైవిధ్యాన్ని పునరుద్ధరించేందుకు, వాతావరణ మార్పు ప్రభావాలతో పోరాడేందుకు మాత్రం ఈ పద్ధతి ఉపయోగపడుతుంది.

-శంకర్ రామన్, శాస్త్రవేత్త , T.R. నేచర్ కన్జర్వేషన్ ఫౌండేషన్

Tags:    

Similar News