పెరుగుతున్న హీట్.. వడదెబ్బ తగలకుండా ఆరోగ్యం కాపాడుకోండిలా!
దిశ, ఫీచర్స్ : దేశ రాజధానికి హీట్ వేవ్ హెచ్చరిక జారీ చేసిన భారత వాతావరణ శాఖ(IMD).. Latest Telugu News..
దిశ, ఫీచర్స్ : దేశ రాజధానికి హీట్ వేవ్ హెచ్చరిక జారీ చేసిన భారత వాతావరణ శాఖ(IMD).. తెలుగు రాష్ట్రాల్లోనూ వడగాలుల ప్రభావం ఉంటుందని సూచించింది. తెలంగాణలో ఇప్పటికే భానుడు ప్రతాపం చూపిస్తుండగా.. ఆదిలాబాద్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ దాటుతున్నాయి. ముందు ముందు రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని, ప్రజలు అవసరమైతే తప్ప బయటికి రావద్దని నిపుణులు సూచిస్తున్నారు. ఇక వడదెబ్బ వల్ల డీహైడ్రేషన్, హీట్ క్రాంప్స్, హీట్ ఎగ్జాషన్ లేదా హీట్ స్ట్రోక్ వంటి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశముండగా.. సురక్షితంగా ఉండేందుకు కొన్ని హెల్త్ టిప్స్ పాటించాల్సిన అవసరముంది.
సంకేతాలు, లక్షణాలు
* హీట్ క్రాంప్స్ : వడదెబ్బకు గురైనప్పుడు సాధారణంగా 102°F కంటే తక్కువ జ్వరం రావచ్చు. దీంతో పాటు వాపు, మూర్ఛ వచ్చే ప్రమాదముంది.
* హీట్ ఎగ్జాషన్ : అలసట, బలహీనత, వికారం, తలనొప్పి, వాంతులు, కండరాల్లో తిమ్మిరి సహా ఒళ్లంతా చెమటలు పడుతుంటాయి.
* హీట్ స్ట్రోక్ : శరీర ఉష్ణోగ్రతలు 104°Fకి మించితే జ్వరం వచ్చే అవకాశంతో పాటు మతిమరుపు, మూర్ఛ రావచ్చు. కొన్ని సందర్భాల్లో కోమాలోకి వెళ్తారు.
వడ దెబ్బ ప్రభావాన్ని ఎలా తగ్గించవచ్చు?
* మధ్యాహ్నం 12.00 నుంచి 3.00 గంటల మధ్య బయటకు వెళ్లడం మానుకోవాలి.
* వీలైనంత తరచుగా నీళ్లు తాగాలి.
* తేలికైన లేత-రంగుల్లో వదులుగా ఉండే పోరస్ కాటన్ దుస్తులు ధరించడం ఉత్తమం. బయటకు వెళ్లేటప్పుడు ఎండ నుంచి రక్షణ పొందేందుకు కూలింగ్ గ్లాసెస్, గొడుగు/టోపీ పెట్టుకోవాలి
* బయట ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు శ్రమతో కూడిన చర్యలకు దూరంగా ఉండాలి. మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల మధ్య ఆరుబయట పని చేయడాన్ని వీలైనంతగా అవాయిడ్ చేయాలి.
* శరీరాన్ని డీహైడ్రేట్‌కు గురిచేసే ఆల్కహాల్, టీ, కాఫీ, కార్బొనేటెడ్ కూల్‌డ్రింక్స్‌కు దూరంగా ఉండాలి
* అధిక ప్రొటీన్లు కలిగిన, నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు తినకూడదు.
* ఓఆర్‌ఎస్, లస్సీ, తోరణి(బియ్యం నీరు), నిమ్మకాయ నీరు, మజ్జిగ, పుదీనా వాటర్ వంటి ఇంట్లో తయారుచేసిన పానీయాలను తరచుగా సేవించాలి. ఇవి శరీరాన్ని హైడ్రేట్ చేయడంలో సాయపడతాయి.
* వీలైనంతగా ఇంట్లో చల్లదనం కోసం అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలి. అందుకోసం కర్టెన్స్, సన్‌షేడ్స్ ఉపయోగించాలి.
ఒంట్లో నలతగా అనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.