మానేరు ఇసుక రవాణాను అడ్డుకుంటాం: మాజీ ఎమ్మెల్యే
దిశ, ఓదెల: పెద్దపల్లి నియోజకవర్గంలోని మానేరు నుంచి ఇసుక రీచ్‌ల పేరిట అక్రమంగా తరలిస్తున్న ఇసుకను అడ్డుకుంటామని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు.
దిశ, ఓదెల: పెద్దపల్లి నియోజకవర్గంలోని మానేరు నుంచి ఇసుక రీచ్‌ల పేరిట అక్రమంగా తరలిస్తున్న ఇసుకను అడ్డుకుంటామని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. బుధవారం ఓదెల మండలంలోని గుండ్లపల్లి, కనగర్తి, మడక, పోతకపల్లి మానేరులో నిర్మించిన చెక్‌డ్యామ్‌లను, ఇసుక రీచ్‌లను పరిశీలించారు. అనంతరం పోతకపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విజయ రమణారావు మాట్లాడుతూ.. మానేరులో చెక్ డ్యాములు నిర్మించడం వల్ల ఇసుక పేరుకుపోయిందని సుల్తానాబాద్, ఓదెల, కాల్వశ్రీరాంపూర్ మండలాల్లో సుమారు 20 ఇసుక రీచ్ టెండర్లు ఏర్పాటు చేశారని అన్నారు. జిల్లా కలెక్టర్, మైనింగ్ అధికారులు జాయింట్ సర్వే చేసిన తరువాతే టెండర్లకు పిలవాలని తెలిపారు. వాల్టా చట్టానికి విరుద్ధంగా మానేరు నుంచి ఇసుక ఇస్తున్నారని దీనివల్ల ఈ ప్రాంత రైతులు, ప్రజలు తాగునీరు, సాగునీరుకు ఇబ్బందులు ఎదుర్కోవడమే కాకుండా భూగర్భజలాలు అడుగంటి పోతున్నాయని అన్నారు.
మానేరులో నిర్మాణం చేపట్టిన చెక్ డ్యాంలు నాణ్యత లోపించడంతో ఆ చెక్ డ్యాములు కులాయని, మరికొన్ని మచ్చుకు కూడా కనిపించడం లేదని, ఒక్కరూపు నారాయణపేటలో నిర్మాణం చేపట్టిన ఒక చెక్ డ్యామ్ మాత్రమే కనిపిస్తున్నదని ఆరోపించారు. కాంట్రాక్టర్ల వద్ద స్థానిక ఎమ్మెల్యే పర్సంటేజ్ తీసుకొని చెక్ డ్యాంల నిర్మాణం వైపు చూడకపోవడంతో వారు ఇష్టానుసారంగా నిర్మాణం చేపట్టారని అన్నారు. కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని రాష్ట్ర సర్కారు దుర్వినియోగం చేస్తుందని ఆయన ఆరోపించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ప్రేమ్ సాగర్ రెడ్డి, ఎంపీటీసీ రాగిడి రవీందర్రెడ్డి, సర్పంచ్ అంకం రమేష్, మాజీ ఎంపీటీసీలు అంబాల కొమురయ్య, ఆవుల ముత్తయ్య, నిర్ల శ్రీనివాస్, సింగిల్విండో డైరెక్టర్లు బొంగాని శ్రీనివాస్ గౌడ్, ఆళ్ల సుమన్ రెడ్డి, మండలంలోని ఆయా గ్రామాల నాయకులు పాల్గొన్నారు.