'ఇది ఇలాగే కొనసాగితే తరిమికొడతాం..'
దిశ, కరకగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా - Forest officers raid farmers' land in Bhadradri Kottagudem district
దిశ, కరకగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల కేంద్రంలోని కన్నాయిగూడెం గ్రామం లో పోడుసాగు చేసుకుంటున్న రైతుల భూమిలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ తేజస్విని ఆధ్వర్యంలో వీరాపురం బీట్ అధికారి విజయ్ వారి సిబ్బందితో కలిసి యంత్రాలతో ట్రెంచ్ లను తీసి మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఇది గమనించిన కన్నాయిగూడెం గ్రామస్తులు ఆదివాసీ గిరిజనులు.. గత 25 సంవత్సరాల నుండి పోడుసాగు చేసుకుంటున్న రైతుల పోడు భూములను లాక్కొని మొక్కలు నాటడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు.
భారత రాజ్యాంగంలో 5వ షెడ్యూల్‌లో పేర్కొన్నట్లుగా షెడ్యూల్డ్ ప్రాంతంలో నివసించే గిరిజనులకు ప్రత్యేక అధికారాలు కల్పించడం జరిగిందని, షెడ్యూల్డ్ ప్రాంతంలో నివసించే షెడ్యూల్డ్ ప్రాంతాల గిరిజనుల కోసం కొన్ని ప్రత్యేక చట్టాలు చేయడం జరిగిందని.. ఆ చట్టాలలో భాగంగా పీసా చట్టం-1996 ప్రకారం గ్రామ సభ నిర్వహించి, గ్రామస్తుల అభిప్రాయం సేకరించిన తర్వాతే వారి తీర్మానం ఆధారంగా ముందుకు వెళ్లాల్సిన ఫారెస్ట్ అధికారులు.. గిరిజనులకు కల్పించిన హక్కులను కాలరాస్తూ.. వారిపై దౌర్జన్యం చేస్తూ.. ఇష్టారాజ్యంగా వ్యవహరించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా గ్రామస్తులు తాము సాగు చేసుకుంటున్న పోడు భూములను ఇచ్చే ఉద్దేశం లేదని తేల్చి చెప్పారు. ఒక పక్క ప్రభుత్వం పోడు భూములకు పట్టాలు ఇస్తామని ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించి.. మరోవైపు ఫారెస్ట్ అధికారులను ఆ భూములపై దౌర్జన్యంగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం అన్యాయమన్నారు. ఇది ఇలాగే కొనసాగితే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని, ఫారెస్ట్ అధికారులను తరిమి కొడతామని స్థానికులు హెచ్చరించారు.