విదేశాలకు సర్వీసులు నడిపే విమానయాన సంస్థలకు ఎక్సైజ్ సుంకం మినహాయింపు!
న్యూఢిల్లీ: దేశీయ విమానయాన సంస్థలకు ఆర్థిక మంత్రిత్వ శాఖ భారీ ఊరటను కల్పించింది.
న్యూఢిల్లీ: దేశీయ విమానయాన సంస్థలకు ఆర్థిక మంత్రిత్వ శాఖ భారీ ఊరటను కల్పించింది. విదేశాలకు విమాన సర్వీసులను నిర్వహిస్తున్న సంస్థలు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల నుంచి విమాన ఇంధన కొనుగోలుపై ఎక్సైజ్ సుంకం మినహాయింపు ఇస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో విమానయాన సంస్థలకు 11 శాతం ప్రాథమిక ఎక్సైజ్ సుంకం వర్తించదని శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ నిర్ణయం జూలై 1వ తేదీ నుంచి వర్తించనున్నట్టు పేర్కొంది.
జూలై 1న ప్రభుత్వం లీటర్‌కు రూ. 6 ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకం విధించిన తర్వాత దేశీయ విమానయాన సంస్థలపై వారి విదేశీ సర్వీసులకు ఇంధన కొనుగోలులో ఎక్సైజ్ సుంకం విధింపుపై గందరగోళం ఏర్పడింది. ఎగుమతి సుంకం విధించడం వల్ల, దేశీయ విమానయాన సంస్థలు విదేశీ సర్వీసులను నడపడానికి కొనుగోలు చేసే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) కోసం 11 శాతం ప్రాథమిక ఎక్సైజ్ సుంకాన్ని చెల్లించాల్సి ఉంటుందని చమురు కంపెనీలు అభిప్రాయపడ్డాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ ఎక్సైజ్ సుంకం వర్తించదని స్పష్టం చేసింది.