రైతన్న కన్నీరు... మార్కెట్‌కు తెచ్చిన ధాన్యం తిరిగి ఇంటికి !?
సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో ధాన్యానికి మంచి ధర లభిస్తుందని ఎంతో ఆశగా వచ్చిన రైతులకు నిరాశే ఎదరైంది.
దిశ, సూర్యాపేట : సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో ధాన్యానికి మంచి ధర లభిస్తుందని ఎంతో ఆశగా వచ్చిన రైతులకు నిరాశే ఎదరైంది. గత మూడు రోజుల క్రితం తీసుకు వచ్చిన ధాన్యానికి రూ.1400 నుంచి రూ.1500 వరకు ధర పలుకుతుండటంతో ఆందోళన చెందారు. ఆరుగాలం కష్టించి శ్రమ చేసి పండించిన ధాన్యాన్ని వ్యాపారులు దోచుకుంటున్నారని.. తెచ్చిన ధాన్యాన్ని తిరిగి ఇళ్లకు తీసుకెళ్తున్నారు. గిట్టుబాటు ధర కోసం మార్కెట్లో రైతులు నిరసన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ మద్దతు కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారు. మార్కెట్లోనే కమీషన్, ఖరీదుదార్లు కనీస గిట్టుబాటు ధర కల్పించకుండా రైతులను నిలువునా దోచుకుంటున్న పరిస్థితి దాపురించింది. శనివారం నిరసన అనంతరం మార్కెట్ ను పరిశీలించిన కలెక్టర్, ట్రేడర్స్ తో మాట్లాడి రీ బిడ్డింగ్ వహించినప్పటికీ ధరలు అందించడంలో విఫలం కావడం వల్లే మార్కెట్లో అమ్మకానికి తెచ్చిన ధాన్యాన్ని కూడా రైతులు తిరిగి ఇంటికి తీసుకు వెళ్తున్న దుస్థితి నెలకొంది.
రాజకీయ నాయకులతో ఫోన్ చేయిస్తే..
మిల్లర్లకు రాజకీయ నాయకులతో ఫోన్ చేయిస్తే క్వింటాకు రూ. 1900 నుంచి రెండు వేల వరకు కొనుగోళ్లు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. నేరుగా వెళ్తే మిల్లర్లు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారులు రూ.1400లకు మించి కొనమని చెప్పడంతోనే తాము తిరిగి ధాన్యాన్ని తీసుకెళ్తున్నామని రైతులు పేర్కొన్నారు. టీఆర్ఎస్, బీజేపీ నాయకులు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవడం తప్ప అసలైన రైతుకు మద్దతు ధర అందించడంలో పూర్తిగా విఫలమయ్యారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కలెక్టర్ హామీ బేఖాతర్...
రైతుల ఆందోళనను తెలుసుకున్న కలెక్టర్ మార్కెట్ వద్దకు వచ్చి అర్ధరాత్రి వరకు ఉండి రైతులతో మాట్లాడారు. ధర పెరిగే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం నిర్వహించిన రీ బిడ్డింగ్‌లో ట్రేడర్స్ ఐదు, పది రూపాయలు నామమాత్రంగా పెంచి చేతులు దులుపుకున్నారని రైతులు తెలిపారు. ఖరీదుదారులతో మాట్లాడినా రైతుకు గిట్టుబాటు ధర రాకపోవడంతో ధాన్యాన్ని ట్రాక్టర్లో పోసుకుని ఆదివారం వెనుతిరుగుతున్నారు. అయితే తమకు పంట పెట్టుబడితోపాటు ధాన్యం రవాణకు చేసిన ట్రాక్టర్ ఖర్చులు కూడా విపరీతంగా పెరిగిపోయాయని వాపోయారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి కనీస ధర లభించేలా కృషి చేయాలని రైతులు వేడుకుంటున్నారు.