ప్రభుత్వంపై యుద్ధానికి సిద్ధమైన వైద్యులు.. అడ్మినిస్ట్రేటివ్ నిర్లక్ష్యంపై సీరియస్
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా సర్కార్ఆసుపత్రుల్లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం వైద్యులు సమరం చేయనున్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా సర్కార్ఆసుపత్రుల్లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం వైద్యులు సమరం చేయనున్నారు. ఏళ్ల తరబడి నుంచి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, నెరవేరని హామీల అమల కోసం ఫైట్చేయనున్నారు. హెచ్ఆర్‌డీఏ, ఐఎంఏ, టీ-జూడా, టీఎస్ఆర్డీఏ, టీజీడీఏ, టీ-డాక్టర్ల ఫోరం, టీడీఎఫ్, కాంట్రాక్ట్ డాక్టర్ల అసోసియేషన్, నర్సింగ్ అసోసియేషన్, పార మెడికల్ అసోసియేషన్లు కలిసి ప్రభుత్వంపై కొట్లాడాలని నిర్ణయించుకున్నాయి. ఈ మేరకు దాదాపు 500 మంది స్టాఫ్‌తో ఈనెల 13న ఇందిరా పార్క్ వద్ద ప్రజారోగ్య పరిరక్షణ సభ పేరిట భారీ స్థాయిలో ధర్నా నిర్వహించనున్నారు. ఇప్పటికే డాక్లర్ల సంఘాలు పోలీసుల అనుమతి కోరాయి. అయితే అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ధర్నాకు అనుమతి ఇస్తారా? లేదా? అనేది ప్రశ్నార్ధకంగా మారింది. ప్రభుత్వం నుంచి అనుమతి రాకపోతే కోర్టును ఆశ్రయించి పర్మిషన్లు తెచ్చుకునేందుకు డాక్టర్ల సంఘాలు అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉన్నారు. వీలైతే అసెంబ్లీ ముట్టడికీ ప్రయత్నిస్తామని డాక్టర్ల సంఘాలు చెబుతున్నాయి.
'6' ప్రధాన అంశాలతో..
ప్రభుత్వంపై యుద్ధం చేసేందుకు ప్రభుత్వాసుపత్రుల్లో పనిచేసే డాక్టర్ల సంఘాలు ఆరు ప్రధాన అంశాలతో ఫైట్ చేయనున్నారు. రెగ్యులర్‌గా డైరెర్ట్ రిక్రూట్మెంట్ లేనందున ఎంతోమంది డాక్టర్లు నిరుద్యోగులుగా మారుతున్నారు. ఏళ్ల తరబడి నుంచి ఎదురుచూస్తున్న నొటిఫికేషన్లు ప్రకటించడం లేదు. కేవలం కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ విధానాల్లో మాత్రమే డాక్టర్లను నియమిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి వస్తున్న కొత్త మెడికల్ కాలేజీలు, దవాఖాన్లు, పీహెచ్‌సీల్లో వైద్యసిబ్బంది నియామకాలు ఇదే విధానంలో జరుగుతున్నాయి. దీంతో ఎంతోమంది డాక్టర్లు నష్టపోతున్నారు. ఇక చాలామంది పేషెంట్లు సకాలంలో ఆసుపత్రులకు వచ్చిన ప్రాథమిక వైద్యంలో నిర్లక్ష్యం జరుగుతున్నది. మెడికల్ఎక్విప్మెంట్లు, నిర్వహణ, సరైన స్టాఫ్అందుబాటులో ఉండకపోవడంతో పేషెంట్లకు వైద్యం అందించేందుకు డాక్టర్లు తిప్పలు పడుతున్నారు. ప్రతీరోజు సుమారు 2 వేల మంది ఓపీ పేషెంట్లు వచ్చే ఉస్మానియా జనరల్‌ఆసుపత్రిలో కొత్త భవనం కడతామని స్వయంగా సీఎం కేసీఆర్గతంలో హామీ ఇచ్చారు. ట్విన్టవర్రూపంలో నిర్మిస్తామన్నారు. కానీ, ఇప్పటి వరకు అది అతీగతీ లేదు. దీంతో ఎంతోమంది రోగులు, డాక్టర్లకు సమస్యలు వస్తున్నాయి.
మరోవైపు అర్హులున్నా ఇన్‌చార్జీలను నియమిస్తూ ప్రభుత్వం వైద్యశాఖను నెట్టుకొస్తున్నది. దీంతో డిపార్ట్మెంట్అస్తవ్యస్తంగా మారిపోయింది. ఇక కొందరు అధికారులు చేస్తున్న తప్పిదాలతో రాష్ట్రంలో నకిలీ వైద్యుల సమస్య పెరుగుతున్నది. స్వయంగా మెడికల్కౌన్సిల్లోనే తప్పదాలు జరుగుతున్నాయంటే ప్రభుత్వానికి ఎంత చిత్త శుద్ధి ఉన్నదో అర్థం అవుతున్నది. దీంతో పాటు సర్కార్ఆసుపత్రుల్లో డాక్టర్లకు భద్రత కరవైంది. రోగుల రద్దీ పెరగడంతో డాక్టర్లు రోగుల బంధువుల మధ్య పలుచోట్ల వాగ్వాదాలు సంభవిస్తున్నాయి. గతంలో ఎంతోమంది డాక్టర్లపై దాడులు జరిగాయి. దీంతో ప్రభుత్వ హాస్పిటల్స్‌కు ఎఫ్‌పీఎస్ భద్రత ఇవ్వాలని డాక్టర్ల సంఘాలు డిమాండ్చేస్తునాయి. కొన్ని ఆసుపత్రుల్లో డాక్టర్లకూ క్యాంటీన్, వాటర్ లేక నానా అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా చెస్ట్ ఆసుపత్రిలో క్యాంటీన్ లేదు. దీంతో పేషెంట్లు, అటెండర్లు రోడ్డు బయట వరకు వచ్చి తినాల్సి వస్తున్నది. ఇదంతా తెలిసినా ఉన్నతాధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. అంతేగాక, చాలా ఆసుపత్రుల్లో వ్యాధి నిర్ధారణ కేంద్రాలు మోరాయించాయి. కొత్తవి ఏర్పాటు చేసినా, ప్రారంభం, ఇన్స్టలేషన్కోసం మిషన్లు ఎదురుచూస్తున్నాయి. తద్వారా రోగులకు చిక్కులు ఏర్పడుతున్నాయి. దీంతోనే ఇప్పుడా సమస్యలను పరిష్కరించేందుకు వైద్యసంఘాలన్నీ యుద్ధం చేసేందుకు రెడీ అయ్యాయి.