ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రిని అలా మారిస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తాం: శ్రీనివాస్

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వ ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రిని అటానమస్‌గా మార్చే ప్రయత్నాలను- Latest Telugu News

Update: 2022-04-04 16:17 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వ ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రిని అటానమస్‌గా మార్చే ప్రయత్నాలను విరమించుకోవాలని సీపీఎం హైదరాబాద్ సిటీ కార్యదర్శి శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. సోమవారం ఎంఎన్‌జే ఆస్పత్రి డైరెక్టర్‌కు సీపీఎం నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఆస్పత్రి అటానమస్‌గా మారితే అన్ని రకాల పరీక్షలకు, వైద్యానికి పెద్ద ఎత్తున ఫీజులు వసూలు చేసే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. దీని కారణంగా సామాన్య పేదలు తీవ్రంగా నష్టపోతారని, ఉచిత వైద్యానికి దూరమవుతారని, ఇప్పటికే అటానమస్‌‌గా నడుస్తున్న నిమ్స్ ఆస్పత్రిలో భారీగా చెల్లించనిదే వైద్యం పొందే పరిస్థితి లేదన్నారు. ఎంఎన్‌జే ఆస్పత్రి కూడా అటానమస్‌గా మారితే నిమ్స్ మాదిరిగా సంపన్నులకే పరిమితం అవుతుందన్నారు. ఈ ఆస్పత్రిని సెమీ అటానమస్‌గా కొనసాగించడం వల్ల ఇప్పటికే యూజర్ చార్జీల పేరుతో వేల రూపాయలు వసూలు చేస్తున్నారని తెలిపారు. ఇది పూర్తిగా చట్టవిరుద్ధం, యూజర్ చార్జీల వసూలు నిలిపేయాలని, సెమీ అటానమస్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

తెలుగు రాష్ట్రాల రోగులకే కాకుండా పరిసర రాష్ట్రాల నుంచి ప్రతి రోజు వచ్చే కొన్ని వందల మంది క్యాన్సర్ రోగులకు ఉచిత వైద్యం అందిస్తున్న ఏకైక ఆస్పత్రి అని, ఈ ఆసుపత్రిని మరింత అభివృద్ధి చేయడానికి అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. ఆస్పత్రి నిర్వహణను పటిష్ట పరచాలని, అవినీతికి ఆస్కారం లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఎంఎన్‌జే ఆస్పత్రిని ప్రభుత్వంలోనే కొనసాగించాలని, అటానమస్‌గా మార్చే చర్యలను కొనసాగిస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తామని తెలియజేశారు.

Tags:    

Similar News