'కుల, మతం పేరుతో మనుషులను విచ్ఛిన్నం చేస్తున్నారు'

దిశ, ముషీరాబాద్ : కుల, మతం పేరుతో మనుషులను కొంత మంది విచ్ఛిన్నం చేస్తున్నారని, దేశ ఐక్యమత్యాన్ని.. Latest Telugu news..

Update: 2022-04-01 16:47 GMT

దిశ, ముషీరాబాద్ : కుల, మతం పేరుతో మనుషులను కొంత మంది విచ్ఛిన్నం చేస్తున్నారని, దేశ ఐక్యమత్యాన్ని, సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. హైదరాబాద్‌ ఎన్టీఆర్‌ స్టేడియంలో మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న జాతీయ సాంస్కృతిక మహోత్సవాలను ముఖ్య అతిథిగా ఆయన హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలో పర్యటనలకు వెళ్ళే ముందు మన దేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో అనేక చారిత్రాత్మక ప్రదేశాలను చూడాలన్నారు. దేశం కోసం బలిదానాలు ఇచ్చిన వారిని గుర్తు తెచ్చుకోవటం మన బాధ్యత అని, అదే అజాదీ కా అమృత అని అన్నారు. భారతీయ సంస్కృతి, హైందవం ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉందన్నారు.


మన బొట్టు, కట్టు, మన భాషలో మాట్లాడాలని సూచించారు. అనంతరం బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. ఉద్యమాలు, దేశభక్తులను రూపొందించే విధంగా ఇక్కడ వివిధ వృత్తులకు చెందిన స్టాళ్లు ఉన్నాయన్నారు. స్వాతంత్య్ర ఉద్యమానికి మరింత కీర్తి ప్రతిష్టలు తేవాలన్నారు. రామప్ప దేవాలయం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిందన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. కరోనా కారణంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించలేక పోయామన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని అడిగి ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. ఈ సంస్కృతి సంప్రదాయాలకు నెలవు తెలంగాణ అని అన్నారు. దేశం కోసం బలిదానాలు చేసిన అమరవీరులకు నివాళులర్పిస్తున్నట్లు ఉందని తెలిపారు. 200 స్టాళ్లను అందరూ సందర్శించాలని కోరారు. ప్రతి ఒక్కరూ మన ఆచార, వ్యవహారాలను తెలుసుకోవాలన్నారు.


క్రాఫ్ట్స్‌ స్టాల్స్‌ను ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ తమిళీసై..

హైదరాబాద్‌ ఎన్టీఆర్‌ స్టేడియంలో మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న జాతీయ సాంస్కృతిక మహోత్సవాల్లో భాగంగా ఏర్పాటుచేసిన క్రాఫ్ట్స్‌ స్టాల్స్‌ను రాష్ట్ర గవర్నర్ తమిళీసై సౌందరరాజన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్‌ను గవర్నర్‌, కేంద్ర మంత్రి సందర్శించారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ.. జాతీయ సాంస్కృతిక మహోత్సవాలను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఉత్సవాలకు మద్దతు ఇవ్వాలని కోరారు. వివిధ రాష్ట్రాలకు చెందిన స్టాల్స్‌ చాలా బాగున్నాయని అన్నారు. దేశ సంస్కృతి, సంప్రదాయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఇలాంటి వేడుకలు దోహదం చేస్తాయన్నారు. కార్యక్రమాల ద్వారా తెలంగాణ ప్రజలు ఇతర రాష్ట్రాల సంస్కృతిని తెలుసుకునే అవకాశం కలుగుతుంది. దేశంలోని అన్ని రాష్ట్రాలను కలిపి ఉంచేది సంస్కృతి.. తెలంగాణకు వచ్చిన సహోదరులకు సహకారం అందించేందుకు రాష్ట్ర ప్రజలందరూ ఈ కార్యక్రమానికి రావాలని కోరారు.

Tags:    

Similar News