క్రిప్టో ఆదాయంపై పన్ను ఉన్నా సరే భారీగా నియామకాలపై వెనుకాడని కాయిన్‌బేస్!
న్యూఢిల్లీ: కేంద్రం క్రిప్టోకరెన్సీ ద్వారా వచ్చే ఆదాయంపై అత్యధికంగా 30 శాతం పన్ను..latest telugu news
న్యూఢిల్లీ: కేంద్రం క్రిప్టోకరెన్సీ ద్వారా వచ్చే ఆదాయంపై అత్యధికంగా 30 శాతం పన్ను విధానాన్ని అమల్లో తెచ్చినప్పటికీ ప్రముఖ క్రిప్టో ఎక్స్‌ఛేంజీ ప్లాట్‌ఫామ్ కాయిన్‌బేస్ భారత్‌లో మరింత సమర్థవంతంగా నియామకాలు చేపట్టనున్నట్టు వెల్లడించింది. దేశీయంగా స్టార్టప్ కంపెనీల్లో పెట్టుబడులను కొనసాగించడమే కాకుండా, ఈ ఏడాది కాయిన్‌బేస్ ఇండియాలో 1,000 మందిని నియమించుకోనున్నట్టు కంపెనీ సీఈఓ బ్రయాన్ ఆర్మ్‌స్ట్రాంగ్ ఓ ప్రకటనలో తెలిపారు.
కాయిన్‌బేస్ వెంచర్స్ ఇప్పటికే క్రిప్టో, వెబ్3 విభాగాల్లోని భారత టెక్ కంపెనీల్లో దాదాపు రూ. 1,150 కోట్ల పెట్టుబడులు పెట్టిందని, భారత స్టార్టప్ వ్యవస్థాపకులకు సహాయం చేసేందుకు కొత్త అవకాశాలను గుర్తించడంలో కృషి చేస్తున్నామని బ్రయాన్ పేర్కొన్నారు. కాయిన్‌బేస్ కంపెనీ భారత్‌లోని కాయిన్‌స్విచ్ కుబేర్, కాయిన్‌డీసీఎక్స్ యూనికార్న్‌లలో పెట్టుబడులు పెట్టింది. అంతర్జాతీయంగా ఆర్థిక స్వేచ్ఛను మెరుగుపరిచేందుకు క్రిప్టోకరెన్సీ మెరుగైన సాధనంగా ఉంటుందని, దీన్ని ప్రపంచంలో ఎక్కడినుంచైనా సులభంగా వినియోగించే అవకాశం ఉంటుందని బ్రయాన్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే దేశీయంగా క్రిప్టోతో పాటు వెబ్3 భవిష్యత్తు టెక్నాలజీ గురించి చర్చించడానికి ఈ నెల 7న క్రిప్టో కమ్యూనిటీ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నట్టు బ్రయాన్ వివరించారు. అమెరికాలోని నాస్‌డాక్‌లో లిస్టింగ్ అయిన కాయిన్‌బేస్ కంపెనీ 2021లో భారత టెక్ హబ్‌ను ప్రారంభించింది. ప్రస్తుతం కంపెనీకి దేశీయంగా 300 మంది ఉద్యోగులున్నారు.