ఆసుపత్రుల్లో బ్యాడ్​ స్మెల్‌.. ఆందోళనలో వైద్యులు

ప్రభుత్వాసుపత్రుల్లో దుర్గంధాన్ని భరించలేకపోతున్నామని స్వయంగా అక్కడ పనిచేసే డాక్టర్లే మొరపెట్టుకుంటున్నారు.

Update: 2022-03-20 17:08 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రభుత్వాసుపత్రుల్లో దుర్గంధాన్ని భరించలేకపోతున్నామని స్వయంగా అక్కడ పనిచేసే డాక్టర్లే మొరపెట్టుకుంటున్నారు. పేషెంట్లకు సేవలందించేందుకు ఇబ్బంది కరంగా మారిందంటున్నారు. ఆసుపత్రులన్నీ క్లీన్​గా ఉండాలని ఆరోగ్యశాఖ మంత్రి హరీష్​రావు ఆదేశాలను క్షేత్రస్థాయి సిబ్బంది గాలికి వదిలేస్తున్నారు. దీంతో సర్కార్​దవాఖాన్లలో కంపు ఇప్పటికీ తొలగిపోలేదు. ఆసుపత్రుల్లోని కొన్ని వార్డుల సమీపంలో చెత్త ,చెదారం ఉండటంతో పాటు దుర్గంధపు వాసనలు వస్తున్నాయి.

అంతేగాక పేషెంట్లకు వినియోగించే సూదీ, కాటన్​,శస్త్రచికిత్స సమయంలో వాడిన రసాయనాలు తదితరవి వార్డుల బయట ఉన్న చెత్త డబ్బాల్లోనే పడేస్తున్నారు. అవి రెగ్యులర్​గా క్లీన్​చేయడం లేదు. ఆఫీసర్లు, హెచ్​ఓడీల రూమ్​ల సమీపంలో మాత్రమే శుభ్రం చేస్తూ మిగతా ప్రదేశాలను లైట్​ తీసుకుంటున్నారు. దీంతో డాక్టర్లు, నర్సులు, పారమెడికల్​, ఇతర స్టాఫ్ లలోని కొందరు నిత్యం ఇన్​ఫెక్షన్ల బారిన పడుతున్నారు. చికిత్సకు వచ్చిన పేషెంట్లు, సహాయకులకు కూడా చిక్కులు వస్తున్నాయి. ఆసుపత్రిలో వచ్చే బ్యాడ్​ స్మెల్‌ తో కొత్త జబ్బులు కూడా వచ్చే ప్రమాదం ఉన్నదని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. శానిటేషన్​సూపర్వైజర్లకు చెప్పినా ఫలితం ఉండటం లేదని మెడికల్​ స్టాఫ్​ వాపోతున్నారు. సుల్తాన్​బజార్​ప్రసూతి ఆసుపత్రి, ఉస్మానియా, నిలోఫర్ లలో పరిస్థితి దారుణంగా తయారైంది. క్లీనింగ్​ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. స్వయంగా మంత్రి చెప్పినా పరిస్థితి మారకపోవడం గమనార్హం.

పనితీరు లేకపోయినా...

మెజార్టీ ప్రభుత్వాసుపత్రుల్లో పారిశుద్ధ్యం, పేషెంట్ కేర్​ వ్యవస్థ నిర్వహణ కాంట్రాక్ట్‌ను ఏజీల్​ సంస్థ దక్కించుకున్నది. గడువు ముగిసినా కొత్త టెండర్లు పిలవకుండా ఇప్పటికీ అదే సంస్థతో నెట్టుకొస్తున్నారు. హైదరాబాద్‌లోని 24 దవాఖాన్లతో పాటు రాష్ర్టంలో ని మరిన్ని ఆసుపత్రుల్లో శానిటేషన్, పేషెంట్​ కేర్​​నిర్వహణ బాధ్యతలు నిర్వర్తిస్తున్నది. అయితే అత్యధిక ఆసుపత్రుల్లో కాంట్రాక్ట్​ ఉండటంతో ఆసుపత్రులపై పూర్తి స్థాయి పర్యవేక్షణ కొరవడింది. దీంతో క్షేత్రస్థాయి సిబ్బంది సమర్ధవంతంగా విధులు నిర్వర్తించడం లేదు. గతంలోనే ఏజీల్​సంస్థ పేషెంట్, శానిటేషన్​ వ్యవస్థలు సరిగ్గా పనిచేయడం లేదని ఆయా ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, డాక్టర్లు పలు మార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. కానీ ఇప్పటికే అదే విధానం కొనసాగుతుండటంపై ప్రభుత్వంపై కూడా పలు అనుమానాలు మొదలయ్యాయి.

పేషెంట్లు రికవరీకి క్లీన్​ఇంపార్టెంట్ : ఓ ప్రభుత్వ డాక్టర్, ప్రసూతి ఆసుపత్రి సుల్తాన్​బజార్​

ఆసుపత్రికి వచ్చిన పేషెంట్లు త్వరగా కోలుకోవాలంటే స్పీడ్​ ట్రీట్మెంట్​తో పాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి. ప్రసూతి ఆసుపత్రిలో శానిటేషన్​ వ్యవస్థ దారుణంగా ఉన్నది. సూపరింటెండెంట్ కు ఫిర్యాదు చేసినా పట్టించుకోరు. దీని వలన ట్రీట్మెంట్ సమయంలో ఇబ్బందులు వస్తున్నాయి. పేషెంట్లకు కొత్త ఇన్​ఫెక్షన్లు రావడమే కాకుండా వైద్యసిబ్బందిలోని కొందరు అస్వస్తతకు గురవుతున్నారు.

Tags:    

Similar News