Health Tips : మీ ఇల్లు సురక్షితమేనా..? బయటకు కనిపించని ప్రమాదాలివిగో!
Health Tips : మీ ఇల్లు సురక్షితమేనా..? బయటకు కనిపించని ప్రమాదాలివిగో!
దిశ, ఫీచర్స్ : ఇల్లు.. మనం ప్రశాంతంగా, సురక్షితంగా ఉండే ఏకైక ప్రదేశంగా భావిస్తాం. జ్వరం వచ్చినా, జలుబు చేసినా కాసేపు బెడ్‌పై అలా ఒరిగితే రిలాక్స్ అవ్వొచ్చు అనుకుంటాం. నిజమే కావచ్చు.. అయినప్పటికీ ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా, అనేక రోగాలకు నిలయం కూడా మన ఇల్లే అవుతుంది అంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఇంటిని క్లీన్ చేసే ప్రొడక్ట్స్ మొదలు కొని రిఫ్రిజిరేటర్లలో స్టోర్ చేసే ఆహారాల వరకూ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. అయితే ఏవి, ఎలాంటి ప్రభావం చూపుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
రోగ నిరోధక వ్యవస్థపై ప్రభావం
పాత లేదా అన్‌కంఫర్టబుల్ పరుపులు (mattress) కూడా మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయని తెలుసా? ఇక్కడ కేవలం నిద్రలేని రాత్రుల గురించే కాదు మనం చూడాల్సింది. ఒక పేలవమైన బెడ్ లేదా పరుపు మీ రోగ నిరోధక వ్యవస్థను కూడా నిర్వీర్యం చేయగలదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే అది పాతబడి నిద్రలేమికి కారణమై మీ శరీరంలో తక్కువ సైటోకిన్‌లను (cytokines) ఉత్పత్తి అయ్యేందుకు కారణం అవుతుంది. వాస్తవానికి ఇది మీ ఇమ్యూన్ సిస్టమ్‌ను బలహీన పరిచే ప్రొటీన్. అలెర్జీల నుంచి క్రానిక్ బ్యాక్ పెయిన్ వరకూ కారణం అవుతుంది.
కిచెన్ టవల్స్‌తో అలెర్జీలు
చాలా మంది ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటారు. కానీ కిచెన్ టవల్‌ను, అలాగే వంట పాత్రలు వేడిగా ఉన్నప్పుడు వాటిని కిందకు దించేందుకు, పట్టుకునేందుకు ఉపయోగించే క్లాతింగ్స్ (మసిబట్ట) గురించి మాత్రం పెద్దగా పట్టించుకోరు. ఏ రెండు మూడు వారాలకో ఒకసారి వాష్ చేస్తుంటారు. అయితే మీరు ప్రతి రోజూ స్నానం చేసినా, ఇంటిని శుభ్రంగా ఉంచుకున్నా అలెర్జీలు, అనారోగ్యాలు సంభవించడానికి ఇవి కూడా ప్రధాన కారణం అవుతాయి. కిచెన్ టవల్స్‌లో ప్రమాదకర బ్యాక్టీరియాలు దాగి ఉండటమే ఇందుకు కారణం. అలాగే మల్టీ యూజ్ కిచెన్ టవల్స్ ఫుడ్ పాయిజనింగ్‌కు గురిచేయవచ్చు.
హౌస్ డస్ట్‌తో ఆస్తమా
తెలిసిన విషయమే అయినా చాలా మంది పట్టించుకోని విషయం ఇది. ఇంటిలో పేరుకుపోయే దుమ్ము ఎక్కువగా వెంట్రుకలు, స్కిన్ బిట్స్, డెడ్ మైక్రోస్కోపిక్ బగ్స్ వంటి హాని కారక ధూళి కణాలు, ఆహార శిథిలాలతో నిండి ఉంటుంది. కొన్నిసార్లు పరుపుల్లోని డస్ట్ భయంకరమైన రసాయన సమ్మేళనాలతో కూడా తయారు చేయబడి ఉండవచ్చు. మొత్తానికి ఇవన్నీ విషపూరిత బ్యాక్టీరియాలకు నిలయంగా ఉంటాయి. ఎప్పటికప్పుడు క్లీన్ చేయకుండా ఉంటే అవి ఆస్తమాకు, ఇతర అనారోగ్యాలకు కారణం కావచ్చు అంటున్నారు నిపుణులు.
టూత్ బ్రష్‌లో బ్యాక్టీరియా
మీ ఇంటిలో పొంచి ఉన్న కనిపించని మరొక ప్రమాదం టూత్ బ్రష్. ఇది తరచుగా వ్యాధికారక బ్యాక్టీరియాలకు నిలయంగా మారుతుంది. అయితే చాలా మంది దీనిని నీటితో వాష్ చేయకుండానే, పేస్ట్ పెట్టేసి బ్రష్ చేస్తుంటారు. ఇక్కడే అసలు సమస్య తలెత్తవచ్చు. బయటి వాతావరణానికి, గాలికి గురయ్యేలా పెట్టడంవల్ల టూత్ బ్రష్‌లపై దుమ్ము, ధూళి, కంటికి కనిపించని సూక్ష్మ క్రిములు పేరుకుపోయి రోగాలకు కారణం అవుతాయి. సో.. యూజ్ చేసిన తర్వాత వాటిని ఏదైనా కవర్‌తో కప్పి ఉంచడం, ఉపయోగించే ముందు నీటితో క్లీన్ చేయడం బెటర్.
మట్టి పూల కుండీలు కూడా..
ఇండ్లలో పెంచుకునే మొక్కలు సహజంగానే మనకు మేలు చేస్తాయి. గాలిని శుభ్ర పర్చడంలో, ఆక్సిజన్ అందించడంలో సహాయపడతాయి. అదే సందర్భంలో మీరు ఇంటి వరండాలో లేదా ఇంటిలో పెంచే మొక్కల కోసం ఉపయోగించే కుండీలలోని మట్టిలో అలెర్జీ కారక సూక్ష్మ జీవులు డెవలప్ అయ్యే చాన్సెస్ ఉన్నాయి. ముఖ్యంగా తడినేల (Damp soil) సూక్ష్మజీవులు అలెర్జీలతోపాటు కొన్నిసార్లు ఇతర జబ్బులకు కారణం కావచ్చు. సో.. మొక్కలు పెంచిన కుండీలకు మరీ దగ్గరగా ఉండటం అంత మంచిది కాదు.
హోస్ పైప్స్ హానికరం
పెరట్లో మొక్కలకు నీటిని అందించేందుకు నల్లాలకు లేదా బోర్ మోటార్ వద్ద ప్లాస్టిక్ పైపులను సహజంగానే కనెక్ట్ చేస్తుంటారు. అయితే వీటిలోని నీరు తాగడానికి అంత సురక్షితం కాదంటున్నారు నిపుణులు. ఎందుకంటే పాలీ వినైల్ క్లోరైడ్ (PVC) పైపులు సీసం, బ్రోమిన్, టిన్ అండ్ థాలేట్‌లతో సహా ప్రమాదకరమైన కలుషితాలకు నిలయంగా ఉంటాయి. కొన్నిసార్లు మీ పెరట్లో ఇవి ఎండకు గురైనప్పుడు వెంటనే వాటి నుంచి వచ్చే నీటిని తాగినప్పుడు పైపుల్లోని హానికారక సమ్మేళనాలు శరీరంలోకి ప్రవేశించే చాన్సెస్ ఉంటాయి కాబట్టి సేఫ్ కాదు.
సువాసనలూ ప్రమాదకరమే
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఏదో పెర్ఫ్యూమ్స్ తప్పకుండా వాడుతుంటారు. నిజానికి ఇవి అత్యంత విషపూరితమైనవి. వాటి తయారీలో ఉపయోగించే అనేక రసాయనాలలో అసిటోన్, బెంజైల్ ఆల్కహాల్, ఇథనాల్, మిథిలిన్ క్లోరైడ్ మిళితం అయి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. వాటిని నేరుగా పీల్చడం ద్వారా సువాసన వెదజల్లే రసాయనాలు నోరు, గొంతు, కళ్లు, చర్మ అనారోగ్యాలకు కారణం అవుతుంది. ముఖ్యంగా చికాకు, దురద వంటివి కలగవచ్చు. కొందరికి పెర్ఫ్యూమ్స్ అలెర్జీలను కూడా కలిగిస్తాయి.
చాపింగ్ బోర్డులు
ఇంటిలో ఉండే చాపింగ్ బోర్డులను ఎప్పటికప్పుడు క్లీన్ చేయకుండా వదిలేస్తుంటారు కొందరు. మళ్లీ ఏదైనా కట్ చేసేటప్పుడు మాత్రమే కడుగుతారు. కానీ గతంలో కట్ చేసిన పచ్చి మాంసం, చేపలు, వివిధ పచ్చి కాయగూరల తాలూకు మిగిలిపోయిన చిన్న చిన్న ముక్కలు దానిపై ఉండిపోవచ్చు. దాని వెనకాల అంటుకొని ఉండవచ్చు లేదా అవి విచ్ఛిన్నం అయి ఈ కోలీ బ్యాక్టీరియా రూపంలో పేరుకుపోయి కూడా ఉండవచ్చు. తర్వాత ఏవైనా పండ్లు, బ్రెడ్, మాంసం వంటివి దానిపై కట్ చేసినప్పుడు అక్కడ ఉంటే బ్యాక్టీరియా అంటుకొని ఆహారంలో కలిసిపోవడంవల్ల ఫుడ్ పాయిజనింగ్‌కు దారితీస్తుంది.
కాఫీ మేకర్
సాధారణంగా మోల్డ్ (ఆకు పచ్చని బూజు), ఫంగస్ తేమగా ఉండే చీకటి ప్రదేశాల్లో వృద్ధి చెందుతుంది. అలాంటి వాటిలో మీ కాఫీ మేకర్ కూడా ఒకటి కావచ్చు. ఎందుకంటే దీనిలో ఒకసారి కాఫీ చేశాక ఎక్కువసేపు గ్యాప్ ఇస్తే మళ్లీ కడిగాక మాత్రమే చేయాలి. కానీ చాలా మంది అలా చేయరు. రోజంతా చేసిన దానిలోనే చేస్తుంటారు. డే బై డే లేదా రెండు రోజులకు ఒకసారి కడిగేవారు కూడా లేకపోలేదు. దీనివల్ల అందులో ఈస్ట్, స్టెఫిలో కాకస్, కోలిఫారమ్ సహా అనేక హానికారక బ్యాక్టీరియాలు డెవలప్ అవుతాయి. కాబట్టి కడగకుండా మళ్లీ కాఫీ చేసి తాగితే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు ఫుడ్ పాయిజనింగ్‌కు, వివిధ అనారోగ్యాలకు గురికావచ్చు.
మేకప్ బ్రష్‌లు
తరచుగా ఉపయోగించే మేకప్ బ్రష్‌లు వాస్తవానికి జెర్మ్స్‌కు (germs) బ్రీడింగ్ గ్రౌండ్స్‌గా పనిచేస్తాయి. వాటిపై స్టెఫిలో కాకస్, స్ట్రెప్టోకోకస్, ఇ.కోలి వంటి చర్మ వ్యాధి కారక క్రిములు, బ్యాక్టీరియాలు పేరుకుపోతాయి. కాబట్టి కడగకుండా యూజ్ చేయవద్దు. అలా చేస్తే స్కిన్ సెప్సిస్, అలెర్జీలు, ఇన్ ఫెక్షన్లు తలెత్తుతాయి.
రిఫ్రిజిరేటర్, ఆహార నిల్వలు
మీ రిఫ్రిజిరేటర్ వెజిటబుల్ ట్రే కూడా ఆహారాన్ని కలుషితం చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఇవి సాల్మొనెల్లా, లిస్టెరియా, ఈస్ట్, ఆకు పచ్చ ఫంగస్ వంటివి కలిగి ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి రిఫ్రిజిరేటర్ ఉష్ణోగ్రత 5°C (41°F) కంటే తక్కువగా మెయింటైన్ చేయాలి. అలాగే కడగని కూరగాయలను, పండ్లను కూడా అందులో నిల్వ ఉంచవద్దు. దీనివల్ల క్రాస్ పొల్యూషన్ తగ్గిపోతుంది.
ప్లాస్టిక్ కంటైనర్లు
ఆహారాన్ని నిల్వ చేయడానికి ఉపయోగించే ప్లాస్టిక్ కంటైనర్లు కూడా హాని కలిగిస్తాయి. ఎందుకంటే వీటిలో బిస్ ఫినాల్ ఎ(BPA) అనే డేంజరస్ కెమికల్స్ ఉంటాయి. వేడి పదార్థాలు వాటిలో పెట్టడం ద్వారా అది ఆహార పదార్థాల్లోకి చేరుతుంది. దీనిని తినడం కారణంగా క్యాన్సర్, నరాల బలహీనత వంటి అనారోగ్యాలకు దారితీస్తాయి.
పెయింటింగ్ బ్రష్‌లు, ఆయిల్ డబ్బాలు
వివిధ ఆయిల్స్, గ్యాస్ అండ్ పెయింట్, ఇండ్లల్లో తరచుగా ఉపయోగించే వివిధ రసాయనాలు తరచుగా ఒక స్టోర్ రూమ్‌లో లేదా సజ్జాలపై భద్రపరుస్తుంటారు. అయితే వీటివల్ల కళ్లు తిరగడం లేదా తలనొప్పి వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. ఎందుకంటే వీటిలో అస్థిర కర్బన సమ్మేళనాలు ఉంటాయి. కొంతకాలం నిల్వచేశాక వాటి వాసన గాలి ద్వారా ఇంటిలోని వ్యక్తులకు చేరుతుంది. మరీ ఎక్కువగా వీటి వాసనలకు గురవుతూ ఉంటే కాలేయం, మూత్ర పిండాలు, నాడీ వ్యవస్థపై ప్రతికూ ప్రభావం పడుతుంది. కాబట్టి వాటిని దూరంగా నిల్వచేయడం లేదా పడివేయడం మంచిది.
స్టవ్, గ్యాస్ సిలిండర్ లీకేజీలు
ప్రతీ ఇంటిలో ఇప్పుడు గ్యాస్ సిలిండర్, వాటర్ హీటర్, స్టవ్ వంటివి తప్పక ఉంటున్నాయి. సరిగ్గా పనిచేయనప్పుడు లేదా లీకేజీల కారణంగా మిమ్మల్ని అనారోగ్యాలకు గురిచేస్తాయి. కొంతమంది స్టవ్‌కి దగ్గరగా ఉండి గ్యాస్ లెవల్ పెంచడం, అలాగే హీటర్‌కు దగ్గరగా ఉండటం వంటివి చేస్తుంటారు. అవి పనిచేస్తున్న క్రమంలో ఏదైనా లోపం తలెత్తితే కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్, సల్ఫర్డయాక్సైడ్లు రిలీజ్ అవుతాయి. ఇవి తలనొప్పి, వికారం, అలసట వంటి అనారోగ్యాలకు కారణం అవుతాయి.
రోజూ తొడిగే షూస్
మీరు రోజూ ఉపయోగించే షూలు కూడా మీకు హాని కలిగిస్తాయి. వాటిని తొడుక్కొని రోడ్డుపై నడిచేటప్పుడు హానికారక బ్యాక్టీరియాలు, మల పదార్థాలు వంటివి కూడా అంటుకుంటాయి. కాబట్టి బయటి నుంచి వచ్చాక చెప్పులు, షూలు బయటే వదలాలి. ఇంటిలోపలి భాగంలో అస్సలు ఉంచకూడదు. ఇలా చేస్తే అవి రోగాలకు కారణం అవుతాయి.
సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ కూడా
ఇంట్లో ధూమపానం చేయడం నిజానికి చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఇది చేసేవారికే కాకుండా సెకండ్ హ్యాండ్ పొగను పీల్చే వారికి కూడా హాని కలిగిస్తుంది. దీనివల్ల ఊపిరితిత్తులు పాడయ్యే చాన్సెస్ ఉంటాయి. అలాగే ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే వారు సెకండ్ హ్యాండ్ పొగకు గురైతే లంగ్స్ డిసీజెస్, ఆస్తమా వంటి సమస్యలను ఎదుర్కోవచ్చు.
Read More...
అర్థరాత్రి ఆకలేస్తే.. వాటికి బదులు వీటిని తినండి!