పరమశివుడికే నోటీసులిచ్చిన కోర్టు.. గుడి ఖాళీ చేయాలని ఆదేశం

దిశ, డైనమిక్ బ్యూరో: ఎవరికైనా సమస్య వచ్చిందంటే చాలు.. వారికి దేవుడు గుర్తొచ్చేస్తాడు. మరి ఆ దేవుడికే సమస్య వస్తే.

Update: 2022-03-22 14:28 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఎవరికైనా సమస్య వచ్చిందంటే చాలు.. వారికి దేవుడు గుర్తొచ్చేస్తాడు. మరి ఆ దేవుడికే సమస్య వస్తే. అవును.. ఆయన కొలువున్న ఆలయాన్ని ఖాళీ చేయాలని సాక్షాత్తు పరమశివుడికే అధికారులు నోటిసులిచ్చారు. ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని రాయ్‌గఢ్‌లోని ప్రభుత్వ భూమిని కబ్జా చేసి శివాలయం నిర్మించారంటూ 25 వార్డుకు చెందిన సుధా రజ్వాడే హైకోర్టులో ఓ పిటిషన్ వేశారు. భూమి కబ్జా కేసులో శివాలయంతో సహా మొత్తం 16 మందిని నిందితులుగా పేర్కొన్నారు. కేసు విచారణకు స్వీకరించిన కోర్టు.. పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో రంగంలోకి దిగిన స్థానిక తహసీల్దార్ కార్యాలయ అధికారులు ప్రత్యేక బృందంగా ఏర్పాటు చేసి మూడు రోజుల పాటు విచారణ చేశారు.

ప్రాథమిక విచారణలో కబ్జా ఆరోపణలో నిందితులైన వారిలో పది మందికి ఎమ్మార్వో కార్యాలయ అధికారులు నోటీసులు ఇచ్చారు. అధికారులు ఇచ్చిన నోటీసులో ''మీరు ప్రభుత్వ భూమిని ఆక్రమించారు. ఛత్తీస్‌ఘడ్ రెవెన్యూ కోడ్​-1959లోని సెక్షన్ 248 ప్రకారం ఇది నేరం. ఇలా చేసినందుకు మిమ్మల్ని ఆ భూమి నుంచి బలవంతంగా ఖాళీ చేయించవచ్చు. రూ.10వేలు జరిమానా విధించవచ్చు". అని హెచ్చరించారు. ఈ సందర్భంగా తొమ్మిది మంది విచారణకు వచ్చేందుకు సిద్ధపడ్డారు. కానీ, అందులో ఆరో నెంబర్‌లో ఉన్న వ్యక్తి పరమశివుడు. పిటిషనర్ ఇచ్చిన ఫిర్యాదులో నిందితుడిగా శివుడుని కూడా పేర్కొన్నారు. దీంతో ఆలయ ధర్మకర్తకో లేక మేనేజర్‌కో ఇవ్వాల్సిన నోటీసులను నేరుగా దేవుడి పేరుతోనే పంపడంతో ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మరి కోర్టు నోటీసులతో ఈ 25న శివుడితో సహా 9 మంది విచారణకు హాజరవుతారో లేదో చూడాల్సి ఉంది.

Tags:    

Similar News