బంపర్ ఆఫర్.. వ్యవసాయం నుంచి వైదొలిగితే రూ. కోటి ఇవ్వనున్న ప్రభుత్వం!
దిశ, ఫీచర్స్ : ప్రపంచంలోని పురాతన వృత్తుల్లో వ్యవసాయం ఒకటి. యునైటెడ్ కింగ్‌డమ్ విషయానికి వస్తే.. Latest Telugu News
దిశ, ఫీచర్స్ : ప్రపంచంలోని పురాతన వృత్తుల్లో వ్యవసాయం ఒకటి. యునైటెడ్ కింగ్‌డమ్ విషయానికి వస్తే.. అక్కడ వ్యవసాయం చేసే వ్యక్తుల్లో ఎక్కువగా వృద్ధులే ఉండటంతో, వాళ్లు ఆ వృత్తి నుంచి వైదొలిగితే డబ్బులు ఇస్తామని యూకే ప్రభుత్వం ఓ కొత్త స్కీమ్ తీసుకొచ్చింది.
ప్రతీ పది మంది బ్రిటీష్ రైతుల్లో నలుగురు 65 ఏళ్లు పైబడిన వారు కాగా, సగటు వయస్సు 59గా నమోదైంది. నిజానికి వయసు మీద పడటంతో కొంతమంది రైతులు రిటైర్ అవ్వాలనుకుంటున్నారు కానీ ఆర్థిక కారణాల వల్ల భారమైనా సరే వ్యవసాయాన్ని నమ్ముకుని బండి లాగిస్తున్నారు. దీంతో ఈ వృద్ధ రైతులను వ్యవసాయం నుంచి వైదొలగమని ప్రలోభపెట్టడం సహా యువతను ఇటువైపుగా ప్రోత్సహించేందుకు బ్రిటిష్ ప్రభుత్వం 'లంప్ సమ్ ఎగ్జిట్' అనే స్కీమ్‌ను తెరమీదకు తీసుకొచ్చింది. ఈ పథకం ప్రకారం రైతులు దాదాపు రూ. 96 లక్షలు( £100,000) నగదును ప్రభుత్వం నుంచి అందుకునే అవకాశముంది. వారికి డబ్బులు రావడంతో ప్రతిగా వాళ్లు తమ భూమిని విక్రయించాలని లేదా కొత్తగా ప్రవేశించే వారికి కౌలుకు ఇవ్వాలని కోరుతున్నారు.
వాస్తవానికి లంప్ సమ్ ఎగ్జిట్ స్కీమ్ యొక్క ఉద్దేశ్యం ఏమిటంటే, వ్యవసాయం నుంచి నిష్క్రమించాలనుకునే రైతులకు వారి భవిష్యత్తు కోసం ఆర్థిక సహాయం చేయడం. కొత్తగా వ్యవసాయంలోకి ప్రవేశించే వారికి భూమిని ఉచితంగా అందిచడం. ఈ స్కీమ్‌కు దరఖాస్తుల ప్రక్రియ ఏప్రిల్‌లో మొదలుకాగా 2022 సెప్టెంబర్ 30 వరకు కొనసాగనుంది.
ప్రయోజనమేంటి?
వ్యవసాయ భూమి మరింత అందుబాటులోకి వచ్చినప్పుడు కొత్త, యువ రైతులు ఈ రంగంలోకి ప్రవేశించేందుకు ఇది వీలు కల్పిస్తుంది. ఏదేమైనప్పటికీ, ఈ పథకం పూర్తిగా కొత్తగా ప్రవేశించే వారి కోసం మాత్రమే రూపొందించలేదు. ఎందుకంటే అప్పటికే వ్యవసాయం చేస్తున్న రైతులు తమ పంటపొలాన్ని విస్తరించాలని చూస్తుంటే పొరుగున ఉన్న పొలాలు తీసుకునే అవకాశముంది. అలాగే పెట్టుబడిదారులు కూడా కొత్త భూమిని కొనుగోలు చేసే అవకాశముంది.
భవిష్యత్తు ఆశాజనకమేనా?
ఈ స్కీమ్‌కు ఎంత మంది రైతులు ఆకర్షితులవుతారు, వారి నిష్క్రమణ ఎలాంటి ప్రభావం చూపుతుంది అనేది ఇప్పటికీ అంచనా వేయలేదు. వాస్తవానికి ఆర్థికంగా ఉన్నవాళ్ళు ఎప్పటిలాగే తమ వ్యవసాయాన్ని సాగిస్తారు. నిష్క్రమించాలనుకునే వారికి ఆఫర్ ఏంటో పూర్తిగా తెలుసు.