కుల బహిష్కరణలపై బీసీ కమిషన్ చైర్మన్ ఆగ్రహం.. డీజీపీకి లేఖ

కుల బహిష్కరణలకు పాల్పడితే ఎంతటి వారిపైనైనా కఠిన చర్యలు తప్పవని బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్ అన్నారు...

Update: 2024-11-27 16:20 GMT

దిశ,తెలంగాణ బ్యూరో: కుల బహిష్కరణలకు పాల్పడితే ఎంతటి వారిపైనైనా కఠిన చర్యలు తప్పవని బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్ అన్నారు. ఉమ్మడి పది జిల్లాల్లో నిర్వహించిన బహిరంగ విచారణలో కొన్ని సమస్యలు కమిషన్ దృష్టికి వచ్చాయని తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ...గ్రామాభివృద్ధి కమిటీల పేరుతో బీసీ వర్గాల ప్రజలను సామాజిక బహిష్కరణకు గురిచేస్తున్న ఉదంతాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. నిజామాబాద్, నిర్మల్‌లో జరిపిన బహిరంగ విచారణలో ప్రజలు, కులసంఘాలు కమిషన్ దృష్టికి ఈ సమస్యను తీసుకొచ్చారన్నారు. దీనిని కమిషన్ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. ప్రజల ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తున్న ఇలాంటి హేయమైన చర్యలను అరికట్టాలని, ఈ ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు చట్టబద్ధత లేని కమిటీలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర డీజీపీకి జితేందర్ కు లేఖ రాశారు. ఈ సమస్యను పోలీసు శాఖ వారు పరిశీలించి కుల బహిష్కరణలకు పాల్పడే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్ కోరారు.


Similar News