మాట తప్పిన కేటీఆర్.. మంత్రి సీతక్క ఫైర్
ఇథనాల్ ఫ్యాక్టరీపై బీఆర్ఎస్ దొంగనాటకాలు బంద్ చేయాలని మంత్రి సీతక్క పేర్కొన్నారు. ...
దిశ, తెలంగాణ బ్యూరో: ఇథనాల్ ఫ్యాక్టరీపై బీఆర్ఎస్ దొంగనాటకాలు బంద్ చేయాలని మంత్రి సీతక్క పేర్కొన్నారు. అబద్ధాల పునాదులపై అధికారంలోకి రావాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తుందన్నారు. బుధవారం ఆమె సచివాలయంలో మాట్లాడుతూ గత ప్రభుత్వం ఇథనాల్ ఫ్యాక్టరీకి అనుమతులు ఇస్తే, కాంగ్రెస్ సర్కార్ ఇథనాల్ ఫ్యాక్టరీని నిలిపివేసిందన్నారు. దిలావార్ పూర్, గుండంపల్లి మధ్యలోని ఇథానాల్ ఫ్యాక్టరీపై కుట్ర జరుగుతుందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హాయాంలోనే ఇథానాల్ ఫ్యాక్టరీకి అన్ని రకాల అనుమతులు వచ్చాయన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక ఎలాంటి పక్రియ చేపట్టలేదన్నారు. ప్రజా ప్రభుత్వంపై కుట్ర చేస్తున్నారని సీతక్క మండిపడ్డారు.
ఇథనాల్ ఫ్యాక్టరికి బీజేపీ, బీఆర్‌ఎస్‌లు కలిసి అనుమతులు ఇచ్చాయని సీతక్క గుర్తు చేశారు. దీనిపై ఆ రెండు పార్టీలు క్లారిటీ ఇవ్వాలని కోరారు. డైరెక్టర్‌గా బీఆర్ఎస్ నేత కుమారుడు ఉన్నాడని గుర్తు చేశారు. ఆందోళన చేస్తున్న రైతులతో మాట్లాడేందుకు వెళ్లిన ఆర్డీవోపై బీఆర్‌ఎస్ కావాలనే దాడి చేసిందన్నారు. సోషల్ మీడియాలో ఇష్టారితిలో విషం వెదజల్లుతున్నారన్నారు. ఉచిత బస్సు సౌకర్యం, ఉద్యోగాలపై కూడా బీఆర్ఎస్ ఇలానే వ్యవహరించిందన్నారు. కిరాయి మనుషులతో సోషల్ మీడియాలో విష ప్రచారం చేస్తున్నారన్నారు. నిర్మల్ ప్రజలకు కేటీఆర్ క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉన్నదన్నారు. అప్పుడు అన్ని అనుమతులు ఇచ్చి, ఇప్పుడు అబద్ధాలు ఆడుతున్న కేటీఆర్ ముక్కు నేలకు రాయాలని మంత్రి సీతక్క వ్యాఖ్యానించారు.