Somu Veerraju: వచ్చే ఎన్నికల్లో ఇద్దరం కలిసే పోటీ చేస్తాం : సోము వీర్రాజు
BJP State Chief Somu Veerraju gives a Clarity On BJP and Janasena Alliance in Andhra Pradesh| రాష్ట్రంలో బీజేపీ జనసేనతోనే ఉంది.. ఉంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. బీజేపీ, జనసేనలు పొత్తులో ఉన్నాయన్న విషయం అందరికీ తెలిసిందేనని చెప్పుకొచ్చారు.
దిశ, ఏపీ బ్యూరో: BJP State Chief Somu Veerraju gives a Clarity On BJP and Janasena Alliance in Andhra Pradesh| రాష్ట్రంలో బీజేపీ జనసేనతోనే ఉంది.. ఉంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. బీజేపీ, జనసేనలు పొత్తులో ఉన్నాయన్న విషయం అందరికీ తెలిసిందేనని చెప్పుకొచ్చారు. భీమవరంలో జరిగిన ప్రధాని నరేంద్ర మోడీ సభకు జనసేనాని పవన్ కల్యాణ్ హాజరు కాలేకపోవడం.. జనసేన ప్రతినిధులు ఎవరూ వేదికపై లేకపోవడంతో బీజేపీకి జనసేన పార్టీ కటీఫ్ చెప్పేసిందంటూ వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. అదే తరుణంలో బీజేపీతో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రహస్య పొత్తు బహిర్గతం అయ్యిందని సోషల్ మీడియాలో వార్తలు విపరీతంగా స్ప్రెడ్ అయ్యాయి. దీంతో ఈ రెండు పార్టీలకు మధ్య గ్యాప్ పెరిగిందా అనే కోణంలో రాష్ట్ర రాజకీయాల్లో చర్చ జరుగుతుంది. ఈ వార్తలపై బీజేపీ రాష్ట్రఅధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు. విజయవాడలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఆగస్టు 2 నుంచి 15వరకు జరగనున్న యువ సంఘర్షణ యాత్రకు సంబంధించిన పోస్టర్, లోగోలను సోము వీర్రాజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జనసేనతో పొత్తుపై క్లారిటీ ఇచ్చారు. ప్రధాని నరేంద్రమోడీ సభను సక్సెస్ చేయాలని కోరుతూ జనసేన కార్యకర్తలకు, మెగా అభిమానులకు పవన్ కల్యాణ్ ఓ వీడియో సందేశం పించారని గుర్తు చేశారు. జనసేన, బీజేపీ పార్టీలు కలిసే ఉన్నాయని... ఇందులో ఎలాంటి సందేహం లేనేలేదని కుండబద్దలు కొట్టారు. అంతేకాదు 2024 ఎన్నికల్లో జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా కలిసే పనిచేస్తాయని సోము వీర్రాజు స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు.
నిరుద్యోగులను నట్టేట ముంచారు
ఎన్నికల ప్రచారంలో లక్షలాది ఉద్యోగాలు భర్తీ చేస్తామంటూ నాడు వైఎస్ జగన్ ప్రకటించారని.. అది నమ్మి చాలా మంది ఓటు వేసి మోసపోయారని చెప్పుకొచ్చారు. యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని అబద్ధపు హామీలు ఇచ్చారంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయలేదన్నారు. టీచర్స్, పోలీసు విభాగాల్లో ఖాళీలు భర్తీ చేస్తాంనని.. కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలను పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చిన జగన్ నేడు వారందరినీ నమ్మించి మోసం చేశారంటూ విరుచుకుపడ్డారు. యువ సంఘర్షణ యాత్ర యువ మోర్చా ఆధ్వర్యంలో నాలుగు జోన్లలో చేపడతారని వెల్లడించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం లేదని వివరణ ఇచ్చారు. ఈ యాత్రకు ప్రభుత్వం అనుమతి ఇస్తుందనే తాము భావిస్తున్నట్లు వెల్లడించారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనలో నల్ల బెలూన్లు ఎగురవేయడం సరైన విధానం కాదని సోము వీర్రాజు హితవు పలికారు. మోడీ సభకు పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చారని.. ఈ కార్యక్రమానికి రాజకీయాలకు ప్రమేయం లేదని సోము వీర్రాజు క్లారిటీ ఇచ్చారు.
రాష్ట్ర అభివృద్ధియే బీజేపీ లక్ష్యం
రాజకీయాల్లో ఎందరో వస్తూ ఉంటారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. అయితే కొంతమంది షడన్‌గా పుట్టుకొచ్చి ప్రపంచ మేధావులుగా మాట్లాడుతారని అలాంటి వారిని తాము పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అనేది మోడీ మంత్రమన్న సోము వీర్రాజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధే తమ పార్టీ లక్ష్యమని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో కొంతమంది కి అధికారమే కావాలని, అభివృద్ధి అక్కర్లేదంటూ సోము వీర్రాజు సెటైర్లు వేశారు. కానీ బీజేపీ కోరుకునేది మాత్రం రాష్ట్ర అభివృద్ధి అని వివరణ ఇచ్చారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో అధికార పార్టీకి ప్రత్యమ్నాయంగా బీజేపీ ఎదుగుతుంది ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ ఎదగడం ఖాయమన్నారు. రాష్ట్రంలో రెండో కోటా రేషన్ పంపిణీని ప్రభుత్వం నిలిపివేసిందని దీనిపై బీజేపీ పోరాటం చేస్తుందని వెల్లడించారు. మరోవైపు రాష్ట్రంలో జాతీయ రహదారులు బాగున్నా.. రాష్ట్ర రహదారులు అధ్వానంగా ఉన్నాయంటూ ధ్వజమెత్తారు. తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో బీజేపీ అధికారం సాధించే దిశగా అడుగులు వేస్తామని.. జాతీయ సమావేశాలలో కూడా ఇదే అంశంపై చర్చించినట్లు సోము వీర్రాజు తెలిపారు.