చొరవ చూపండి.. నిధులు పెంచండి: కేంద్రానికి పవన్ కీలక ప్రతిపాదనలు
రాష్ట్ర ప్రాజెక్టులకు నిధులు పెంచాలని కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విజ్ఞప్తిచేశారు..
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో సీసీ రోడ్లు, డ్రైయిన్లు, అంగన్వాడీ, వ్యవసాయ గిడ్డంగులు, మహిళా స్వయం సహాయక సంఘాల భవనాల నిర్మాణాలకు నిధులను పెంచాలని కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్(Union Minister Shivraj Singh Chouhan)ను రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Deputy CM Pawan Kalyan)కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను ఆయన కలిశారు. పలు కీలక అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రం తరపున పలు ప్రతిపాదిత అంశాలపై పవన్ చర్చించారు.
‘‘ఉపాధి హామీ పనుల్లో భాగంగా పీఎమ్ ఆవాస్ యోజన(PM Awas Yojana) ద్వారా ఇళ్లు కట్టుకోవడానికి 90 రోజులు పని దినాలు ఉంటాయి. అలాంటి వారికి అదనంగా 100 రోజుల పని దినాలు కల్పిండి. గ్రామీణుల కోసం ఉపాధి నిధులతో శ్మశానవాటికలు, పంచాయతీ భవనాలకు ప్రహరీల నిర్మాణం, దోబిఘాట్‌లు, ఆరోగ్య సబ్ సెంటర్లు, గ్రామాల్లో తాగునీటికి అవసరమైన పనులు చేయించండి. వాటర్ షెడ్ పథకం వాటా నిధులను తగ్గించి 90 : 10 దామాషా ప్రకారం నిధుల కేటాయింపులు జరపండి.’’ అని కేంద్రమంత్రిని పవన్ కోరారు.
గ్రామీణ రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యం
‘‘ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన(Pradhan Mantri Grameen Sadak Yojana), ఏపీ రూరల్ రోడ్డు(AP Rural Road) ప్రాజెక్టు, నాబార్డు(NABARD), రాష్ట్ర ప్రభుత్వ నిధులతో గ్రామీణ రోడ్లను ఆధునీకరిస్తున్నాం. రాష్ట్రంలో 2,643 గ్రామాలకు అనుసంధానం చేసేలా రోడ్లు వేయాలని కోరాం. కానీ పీఎం గ్రామీణ సడక్ యోజన కింద 413 రోడ్లు నిర్మాణానికి మాత్రమే అనుమతి వచ్చింది. 2,230 గ్రామాలకు ఇంకా అనుసంధాన రోడ్లు వేయాలి. గ్రామీణ సడక్ యోజన – 4 కింద గ్రామాల్లోని అంతర్గత దారులు కూడా బాగు చేసుకునేందుకు అవకాశం కల్పించాలి. ముఖ్యంగా పాఠశాలలు, ఆస్పత్రులు, మార్కెట్లు, పరిపాలన భవనాలకు వెళ్లే అధ్వాన రోడ్లను బాగు చేసుకునేందుకు కేంద్రం చొరవ చూపాలి. 100 జనాభా దాటిన గ్రామాలకు సైతం అనుసంధాన రోడ్లు వేసులా పథకంలో చోటు కల్పించాలి.’’ అని కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు.