లంకకు బిగ్ షాక్.. టీ20 సిరీస్‌కు స్టార్ ఆల్‌రౌండర్ దూరం!

Update: 2022-02-23 13:19 GMT

లక్నో: శ్రీలంక ఆల్‌రౌండర్ వానిందు హసరంగ టీమ్ ఇండియాతో జరిగే టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు. ఆస్ట్రేలియా పర్యటనలో కరోనా బారిన పడిన హసరంగ ఇంకా కోలుకోకపోవడంతో టీ20 మ్యాచ్‌లకు అందుబాటులో ఉండటం లేదని శ్రీలంక క్రికెట్ బోర్డు(ఎస్‌ఎల్‌సీ) వెల్లడించింది. ఈ నెల 15న హసరంగకు కరోనా సోకగా ఆస్ట్రేలియాలోనే ఐసోలేషన్‌లో ఉన్నాడు. మంగళవారం మరోసారి నిర్వహించిన పరీక్షల్లోనూ అతనికి కరోనా పాజిటివ్‌గా తేలింది.

దీంతో హసరంగ అక్కడే ఉండగా.. శ్రీలంక జట్టు నేరుగా భారత్ చేరుకుంది. అయితే, తొలి టీ20 మ్యాచ్‌కు మాత్రమే హసరంగ దూరంగా ఉంటాడని ఎస్‌ఎల్‌సీ మెడికల్ కమిటీ పేర్కొన్నా.. అతను సిరీస్ మొత్తానికి దూరమవుతాడని తెలుస్తున్నది. లక్నో వేదికగా భారత్‌తో శ్రీలంక నేడు తొలి టీ20 మ్యాచ్ ఆడనుంది. మిగతా రెండు మ్యాచ్‌లు ఈ నెల 26, 27 తేదీల్లో ధర్మశాలలో జరగనున్నాయి.

అయితే, నిబంధనల ప్రకారం మ్యాచ్‌లో పాల్గొనే ముందు ఆటగాళ్లు మూడు రోజులపాటు క్వారంటైన్‌లో ఉండాలి. ఈ నేపథ్యంలో హసరంగ కరోనా నుంచి కోలుకుని భారత్‌కు చేరుకున్నా క్వారంటైన్ నిబంధనల ప్రకారం మిగతా మ్యాచ్‌లకు కూడా అతను అందుబాటులో ఉండే అవకాశం లేదు.

Tags:    

Similar News