Pro-Pakistan: బాత్రూమ్ గోడలపై పాకిస్తాన్ నినాదాలు.. కర్ణాటక టయోటా కంపెనీలో ఘటన
కర్ణాటకలోని రామ్ నగర్ పట్టణంలో టయోటా ఆటో మొబైల్ కంపెనీలోని గోడలపై పాకిస్తాన్ కి మద్దతుగా నినాదాలు కనిపించాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: (Karnataka) కర్ణాటకలోని రామనగర (Ramanagara) పట్టణంలో టయోటా ఆటో మొబైల్ కంపెనీలోని గోడలపై (Pakistan slogans) పాకిస్తాన్‌కి మద్దతుగా నినాదాలు కనిపించాయి. ఈనెల 15న ఈ ఘటన జరగ్గా గుర్తించిన కంపెనీ యాజమాన్యం నోటీసు బోర్డు మీద రాసి మరోసారి రిపీట్ అయితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. ఇక కంపెనీ ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులను గుర్తించారు. సీసీటీవీ ఫుటేజ్‌తో సహా ఆధారాలు సేకరించి, 50 మందికి పైగా అనుమానితుల చేతిరాతను పరిశీలించారు. కంపెనీలో ఏడాదిగా కాంట్రాక్టు బేస్ మీద పనిచేస్తున్న హైమద్ హుసేన్ (24), సాదిక్ (20) ఆ రాతలు రాసినట్లు గుర్తించారు. ఉత్తర కర్ణాటకలోని బీదర్‌కు చెందిన ఈ ఇద్దరు వ్యక్తులు ఒక సంవత్సరం పాటు ఈ యూనిట్‌లో పనిచేస్తున్నారు. హుస్సేన్ స్టోర్స్‌లో హెల్పర్‌గా పని చేయగా, సాదిక్ ప్రొడక్షన్ లైన్‌లో అసిస్టెంట్‌గా పనిచేశారని పోలీసులు తెలిపారు. వారు బాత్ రూమ్ గోడలపై ఈ రాతలు రాయగా.. ఓ ఉద్యోగి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో విషయం వెలుగు చూసింది.
ఇక, ఇద్దరినీ తాజాగా రామనగరలోని స్థానిక కోర్టు ముందు హాజరుపరిచి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించారు. ఈ కేసుకు సంబంధించి మరికొంత మందికి నోటీసులు జారీ చేసినట్లు అధికారి శ్రీనివాస్ గౌడ తెలిపారు. ఫిబ్రవరిలో దుబాయ్‌లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లో టీమిండియాతో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లో పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఓడిపోయిన తర్వాత హుస్సేన్, సాదిక్ కోపంగా ఉన్నారని సహచర ఉద్యోగులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే వారు టాయిలెట్ లోపలికి వెళ్లి.. మార్కర్ ఉపయోగించి గోడలపై మొదట పాకిస్తాన్‌ను ప్రశంసిస్తూ.. తర్వాత కన్నడ వారిని కించపరుస్తూ పదాలు రాశారు.