ఫిబ్రవరిలో 23 శాతం పడిపోయిన వాహనాల హోల్‌సేల్ అమ్మకాలు!
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఆటోమొబైల్ పరిశ్రమలో సెమీకండక్టర్ల కొరతతో పాటు వివిధ..telugu latest news
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఆటోమొబైల్ పరిశ్రమలో సెమీకండక్టర్ల కొరతతో పాటు వివిధ సరఫరా సవాళ్లు, ధరల పెరుగుదల కారణంగా వాహన తయారీ కంపెనీల హోల్‌సేల్ అమ్మకాలు గత నెల 23 శాతం క్షీణించాయని పరిశ్రమ సమాఖ్య సియామ్ వెల్లడించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో కంపెనీలు డీలర్‌షిప్‌లకు అందించే వాహనాల సంఖ్య 13,28,027 యూనిట్లకు తగ్గాయని సియామ్ తెలిపింది. గతేడాది ఇదే నెలలో మొత్తం 17,35,909 యూనిట్లను పంపించాయి. వీటిలో ప్యాసింజర్ వాహనాలు 6 శాతం పడిపోయి 2,62,984 యూనిట్లు నమోదవగా, గతేడాది ఇదే నెలలో మొత్తం 2,81,380 యూనిట్లను డీలర్లకు సరఫరా చేసినట్లు కంపెనీలు చెబుతున్నాయి. సమీక్షించిన నెలలో ప్యాసింజర్ కార్లు మాత్రమే 13 శాతం తగ్గి 1,33,572 యూనిట్లుగా నమోదయ్యాయి. యుటిలిటీ వాహనాలు 1,20,122 యూనిట్ల నుంచి 1,14,350 యూనిట్లకు క్షీణించాయి.
ఇక, ద్విచక్ర వాహనాలు అధికంగా 27 శాతం పడిపోయి 14,26,865 యూనిట్ల నుంచి 10,37,994 యూనిట్లుగా ఉన్నాయి. స్కూటర్లు సైతం 4,65,097 యూనిట్ల నుంచి 3,44,137 యూనిట్లకు తగ్గాయి. మోటార్‌సైకిల్ అమ్మకాలు 9,10,323 యూనిట్ల నుంచి గత నెల 6,58,009 యూనిట్లకు తగ్గాయని సియామ్ వివరించింది. 'సెమీకండక్టర్ల కొరతతో పాటు వాహనాల ధరలు పెరగడం, ముడి సరుకులు, లాజిస్టిక్ వ్యయం భారంగా మారడంతో సరఫరాలో సవాళ్లు ఎదురయ్యాయి. దీనివల్ల ఆటో పరిశ్రమలో మొత్తం అమ్మకాలపై ప్రభావం చూపిందని' సియామ్ డైరెక్టర్ జనరల్ రాజేష్ మీనన్ అన్నారు.