అధికారంలోకి వస్తే డ్రగ్స్ నిర్మూలిస్తాం: కేంద్రమంత్రి అమిత్ షా

Update: 2022-02-13 11:29 GMT

ఛండీగఢ్: రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే డ్రగ్స్ నిర్మూలిస్తామని కేంద్రమంత్రి అమిత్ షా అన్నారు. దేశ ప్రధానికే రక్షణ కల్పించలేని వ్యక్తి, పంజాబ్ రాష్ట్రాన్ని ఎలా సురక్షితంగా ఉంచుతారని ప్రశ్నించారు. పంజాబ్ లుధియానాలో దారేసి గ్రౌండ్‌లో ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. గత నెలలో ప్రధాని భద్రతా వైఫల్యాన్ని ఎత్తిచూపుతూ ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. 'పంజాబ్‌లో సిక్కు, హిందు మతమార్పిడిల సమస్య ఉంది. ఛన్నీ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గానీ, ఆప్ గానీ వీటిని ఆపలేవు. ఇలాంటి మార్పిడిలను కేవలం బీజేపీ మాత్రమే ఆపగలదు' అని అన్నారు. 1984లో సిక్కు వ్యతిరేక అల్లర్లను ఎప్పటికీ మరిచిపోలేమని చెప్పారు. ఆ సంఘటనలు ఇప్పటికీ కళ్లలో నీళ్లు తెప్పిస్తాయన్నారు. కాంగ్రెస్ చేసిన ఈ పాపాన్ని చన్నీ వివరించాలని నొక్కి చెప్పారు. ఆహార ధాన్యాల ఉత్పత్తిలో దేశం స్వావలంబన సాధించడానికి రాష్ట్ర రైతుల కృషి కారణమని షా అన్నారు. పంజాబ్ స్వాతంత్ర ఉద్యమ కాలం నుండి తన పుత్రులను దేశానికి ఇస్తూనే ఉందని ఉద్ఘాటించారు. ఆప్ ఛీఫ్ అరవింద్ కేజ్రివాల్‌పైన విమర్శలు గుప్పించారు. పంజాబ్‌లో కేజ్రివాల్ డ్రగ్స్‌ను ఎలా ఆపుతారని ఆయన ప్రశ్నించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్రంలో డ్రగ్స్‌ను నిర్మూలిస్తామని అన్నారు. ఇప్పటికే ప్రజలు కాంగ్రెస్, శిరోమణి ఆకాలీదళ్‌కు అవకాశాలు ఇచ్చారన్నారు. ఈసారి బీజేపీకి అవకాశం ఇచ్చి రాష్ట్రాన్ని సురక్షిత హస్తాల్లో పెట్టాలని ఆయన కోరారు.

Tags:    

Similar News