Drugs: గంజాయికి బానిసైన కొడుకు.. ఇంటికి రాగానే తల్లి ఏం చేసిందంటే..

దిశ, కోదాడ : గంజాయికి బానిపైన కొడుకు 15 రోజుల తర్వాత ఇంటికి వచ్చాడు. వచ్చీరాగానే అతడి తల్లి చేసిన పనికి ఊరంతా నివ్వెరబోయింది

Update: 2022-04-04 09:30 GMT

దిశ, కోదాడ : గంజాయికి బానిపైన కొడుకు 15 రోజుల తర్వాత ఇంటికి వచ్చాడు. వచ్చీరాగానే అతడి తల్లి చేసిన పనికి ఊరంతా నివ్వెరబోయింది. రాకరాక ఇంటికి వచ్చిన కొడుకును ఇంటి బయట కరెంటు స్తంభానికి కట్టేసింది. అంతటితో ఆగలేదు. గంజాయి మత్తు వదిలేలా ముఖమంతా కారం పూసింది. 'వద్దని చెప్పా.. మంచిగా చదువుకో అని చెప్పా.. నీకోసమే నేను బతుకుతున్నానని చెప్పా.. నువ్వు ఎంత చదివితే అంత చదివిస్తా నువ్వు మంచి స్థానంలో ఉండాలి' అని ఆ తల్లి తన కొడుక్కు ఎన్నోసార్లు చెప్పింది. కానీ ఆ కొడుకు తన తల్లి మాటలను పెడచెవిన పెట్టాడు. గంజాయి మత్తుకు బానిసయ్యాడు. దాంతో ఆ తల్లికి కడుపు మండింది. తన కొడుకు తనకు చేతికి రాకుండా పోతాడేమో అని ఆవేదనతో.. తానే తన కొడుకుని శిక్షించింది.

కొడుకును స్తంభానికి కట్టేసి, కంట్లో కారం పెట్టి బుద్ధి చెప్పే ప్రయత్నం చేసింది. ఈ ఘటన కోదాడ పట్టణంలోని 35వ వార్డులో చోటుచేసుకుంది. కన్న కొడుకు కారంతో అల్లాడుతుంటే.. ఆ తల్లి కళ్ళల్లో కన్నీళ్లు తన్నుకొచ్చాయి. తన కొడుకుని కాపాడుకోవాలనే ప్రయత్నం కోసం తాను శిక్ష అనుభవిస్తూ కొడుకుని శిక్షించింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి కోదాడ పట్టణంలో గంజాయిని పూర్తిస్థాయిలో నిర్మూలించి.. యువతను కాపాడాలని ఆ తల్లి వేడుకుంటుంది. ఆమె చేసిన పని కొంతమందికి నచ్చినా.. నచ్చకపోయినా.. కొడుకుని సరైన మార్గంలోకి తెచ్చుకునేందుకు ఆమెకు వేరే మార్గం కనిపించలేదని కొంత మంది అభిప్రాయపడుతున్నారు.

Tags:    

Similar News