యూత్ కాంగ్రెస్ వార్ రూం కేసులో బిగ్ ట్విస్ట్!
యూత్ కాంగ్రెస్ వార్ రూంపై పోలీసుల దాడి కేసులో ఊహించని ట్విస్ట్ వెలుగులోకి వస్తోంది....
- పోలీసుల సోదాల వెనుక సొంత పార్టీ సీనియర్ నేత?
- తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మూడు నెలల క్రితం ఫిర్యాదు!
- ట్రోల్ చేస్తున్న నెంబర్‌తో వార్ రూంకు లింక్?
- సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం
దిశ, డైనమిక్ బ్యూరో: యూత్ కాంగ్రెస్ వార్ రూంపై పోలీసుల దాడి కేసులో ఊహించని ట్విస్ట్ వెలుగులోకి వస్తోంది. గత రాత్రి బంజారాహిల్స్‌లోని యువజన కాంగ్రెస్ సోషల్ మీడియా వార్ రూంపై సీసీఎస్ పోలీసులు దాడులు చేసి కంప్యూటర్లు, హార్డ్ డిస్క్‌లు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే దీని వెనుక సొంత పార్టీ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన ఇచ్చిన ఫిర్యాదుతోనే పోలీసులు కాంగ్రెస్ వార్ రూంపై సోదాలు నిర్వహించినట్లు సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. తనపై దుష్ర్పచారం చేస్తున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి మూడు నెలల క్రితం ఫిర్యాదు ఇవ్వగా రంగంలోకి దిగిన పోలీసులు దుష్ర్పచారానికి పాల్పడుతున్న ఫోన్ నెంబర్ యూత్ కాంగ్రెస్ వార్ రూంకు అనుబంధంగా ఉందని అందువల్లే పోలీసులు ఈ సోదాలు నిర్వహించినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
గతంలో సునీల్ కనుగోలు ఆఫీస్‌పై పోలీసులు దాడి జరిపిన సమయంలోనూ ఉత్తమ్ కుమార్ రెడ్డి తనపై సొంత పార్టీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా యూత్ కాంగ్రెస్ వార్ రూం విషయంలోను ఇవే తరహా ఆరోపణలు రావడం హాట్ టాపిక్‌గా మారుతోంది. సొంత పార్టీ నేతలకు డ్యామేజ్ జరిగేలా హస్తం పార్టీలో కుట్ర కోణాల ఆరోపణలు రావడం సంచలనంగా మారుతోంది. అయితే ఈ ప్రచారం విషయంలో కాంగ్రెస్‌లోని మిగతా సీనియర్లు ఎలా రియాక్ట్ అవుతారనేది ఆసక్తిగా మారింది.