Child's Sickness: ‘మీ పిల్లల అనారోగ్యానికి లీవ్ అంటే కుదరదు’.. కంపెనీ మెమో పై నెటిజన్ల ఆగ్రహం

మీ పిల్లల అనారోగ్యానికి లీవ్ అంటే కుదరదు అంటూ ఓ కంపెనీ మెమోపై నెటిజన్లు మండిపడుతున్నారు.

Update: 2024-09-10 06:45 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: సెలవుల విషయంలో ప్రతి కంపెనీ దాని విధానాలు, నియమాలు రూపొందించుకుంటుంది. ఆ కంపెనీ పరిమాణం, ఆ కంపెనీ ఏ రంగం వంటి అంశాల ఆధారంగా లీవ్ పాలసీలను రూపొందించుకుంటాయి. అయితే తాజాగా ఓ కంపెనీ ఉద్యోగుల లీవ్ విషయంలో పెట్టిన ఓ రూల్ ఇంటర్నెట్ లో చర్చకు దారి తీసింది. ఉద్యోగులు తమ పిల్లల అనారోగ్యం వల్ల డ్యూటీకి రాకపోవడం సరైన కారణం కాదంటూ ఓ కంపెనీ మెమో జారీ చేసింది. మేము మీ పిల్లలను పనిలో పెట్టుకోలేదు. అందువల్ల వారి అనారోగ్యం బారిన పడ్డారని మీరు పనిని మిస్ చేయడం సరికాదని పేర్కొంది. రెడ్డిట్ ఫోరమ్ లో ఓ యూజర్ షేర్ చేసిన ఈ మెమో ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది ఏ కంపెనీ జారీ చేసిన మెమో పేర్కొనబడనప్పటికీ ఈ ఆలోచన నెటిజన్లను ఆగ్రహానికి గురి చేస్తున్నారు.

చాలా మంది యూజర్లు ఉద్యోగం, వ్యక్తిగత జీవితం సమతుల్యత, ఉద్యోగుల శ్రేయస్సు పట్ల కంపెనీ వైఖరిని నిలదీస్తున్నారు. ఈ విధానం వల్ల ఉద్యోగులు తమ అనారోగ్యంతో ఉన్న పిల్లలను ఆఫీస్ కు తీసుకురావడానికి దారి తీస్తుందని ఫలితంగా సహోద్యోగులలో అనారోగ్యం వ్యాప్తి చెందుతుందని కొందరు కామెంట్ చేయగా మరో యూజర్ స్పందిస్తూ ఇలాంటి నియమం పాటించాలంటే కేవలం అనాథలకు నియమించుకుంటే సరి అంటూ మండిపడ్డాడు. మరి కొందరు ఈ మెమో జారీ చేసిన కంపెనీ పేరు బహిర్గతం చేయాలని ఆ సంస్థ అమానవీయ విధానానికి సిగ్గుపడాలని పిలుపునిచ్చారు. మొత్తంగా ఈ మెమో అంశం సోషల్ మీడియాలో డిబేట్ గా మారింది. 


Similar News