దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట(Yadagirigutta) లక్ష్మీనరసింహ స్వామి ఆలయం విమాన గోపురం బంగారు తాపడం(Gopuram gold plating) పనులు లాంఛనంగా శ్రీకారం చుట్టారు. ఆలయానికి చేరుకున్న బంగారు తాపడం రేకులకు ప్రధానాలయంలో అధికారులు, అర్చకులు పూజలు చేసి, తాపడం పనులను లాంఛనంగా ప్రారంభించారు. చెన్నైలోని మెసర్స్ స్మార్ట్ క్రియేషన్స్ సంస్థ స్వర్ణ తాపడం పనులను నిర్వహిస్తుంది. స్వర్ణ తాపడం తయారీ పనులకు అవసరమైన రూ.7 కోట్ల మొత్తాన్ని దేవస్థానం చెల్లిస్తుంది. స్వామివారి ప్రధానాలయ విమాన గోపురం 10,500 ఎస్‌ఎఫ్టీల మేరకు రాగి రేకులకు బంగారు తాపడం చేయాల్సి ఉంది. ఇప్పటికే 1600ఎస్ఎఫ్టీల రాగి రేకులకు బంగారు తాపడం పూర్తికావడంతో వీటిని విమాన గోపురానికి అమర్చేందుకు ఆలయానికి తీసుకవచ్చి పూజలు చేశారు. వాటిని గోపురానికి అమర్చే పనులు చేపట్టారు.
అంతకుముందే గోపురం కోసం తయారు చేసిన దేవతల విగ్రహాలతో కూడిన రాగి రేకులను అక్టోబర్‌లో ఆలయ అధికారుల పర్యవేక్షణలో చైన్నైకు తరలించారు. ఇటీవల సుదర్శన చక్రంలో నుంచి చక్ర ఆళ్వార్లను కలశంలోకి ఆహ్వానించే మహా కళావరోహణం నిర్వహించారు. 2025 ఏడాది ఫిబ్రవరి నాటికి విమాన గోపురం బంగారు తాపడం అమరిక పనులు పూర్తి చేయనున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో విమాన గోపురానికి కుంభాభిషేకం జరిపి, మహా సంప్రోక్షణ చేపట్టిన అనంతరం బ్రహ్మోత్సవాలు నిర్వహించే అవకాశం ఉంది.