భూ భారతిలో 11 వేల మంది విలేజ్ అడ్మినిస్ట్రేషన్ల నియామకం

భూ భారతితో గ్రామం, మండల స్థాయిలోనే స‌మ‌స్యల ప‌రిష్కారం లభిస్తుందని, భూ త‌గాదాల ప‌రిష్కారానికి కోర్టు మెట్లు ఎక్కాల్సిన అవ‌స‌రం లేద‌ని రైతు సేవా ఫౌండేషన్ చైర్మన్ ఎం.సునీల్ కుమార్(భూమి సునీల్) అన్నారు.

Update: 2024-12-23 10:25 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: భూ భారతితో గ్రామం, మండల స్థాయిలోనే స‌మ‌స్యల ప‌రిష్కారం లభిస్తుందని, భూ త‌గాదాల ప‌రిష్కారానికి కోర్టు మెట్లు ఎక్కాల్సిన అవ‌స‌రం లేద‌ని రైతు సేవా ఫౌండేషన్ చైర్మన్ ఎం.సునీల్ కుమార్(భూమి సునీల్) అన్నారు. ఈ చట్టం ద్వారా రైతాంగం ఎదుర్కొంటున్న అన్ని ర‌కాల స‌మ‌స్యల‌కు ప‌రిష్కారం చూపుతుంద‌న్నారు. చ‌ట్టం అమ‌ల్లోకి రాగానే స‌మ‌స్యల ప‌రిష్కారానికి గ్రామానికి ఒక రెవెన్యూ అధికారి రాబోతున్నార‌ని, ఇక‌పై ఏ స‌మ‌స్య ఉన్నా రైతులు వారి గ్రామంలో ఉన్న అధికారి ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చన్నారు. స‌మ‌స్య ప‌రిష్కారం ఏ స్థాయిలో ఉందో కూడా ఎప్పటిక‌ప్పుడు స‌మాచారం పొంద‌వ‌చ్చన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 11 వేల మంది గ్రామ భూ ప‌రిపాల‌న అధికారులు రానున్నార‌ని చెప్పారు. న‌ల్గొండ జిల్లా దేవ‌ర‌కొండ రెవెన్యూ డివిజ‌న్ చందంపేట మండ‌లంలోని కంబాల‌ప‌ల్లి గ్రామంలో జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా సోమవారం రైతుల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న రైతు సేవా ఫౌండేష‌న్ భూ భార‌తి చ‌ట్టం–2024 పై రైతులతో ముఖాముఖీ నిర్వహించింది. స‌ద‌స్సులో కొత్త చ‌ట్టం ఆవ‌శ్యక‌త‌ను, చ‌ట్టంలో ఉన్న కీల‌క అంశాల‌ను, ప్రస్తుతం రైతాంగం ఎదుర్కొంటున్న స‌మ‌స్యల‌ను ఈ చ‌ట్టం ఎలా ప‌రిష్కరించ‌నున్నదో వివ‌రించారు. 

రైతు సేవా ఫౌండేష‌న్ అధ్యక్షులు, ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి.ల‌చ్చిరెడ్డి మాట్లాడుతూ.. రైతుల‌కు అన్ని విధాలుగా అండ‌గా ఉండాల‌ని రైతు సేవా ఫౌండేష‌న్ ఏర్పాట్లు చేశామన్నారు. మార్కెట్ స‌మ‌స్యలు, ఆధునిక ప‌రిజ్ఞానం, రైతుల‌ను ఆర్థికంగా ప‌రిపుష్ఠం చేయ‌డం వంటి అంశాలపై ఫౌండేష‌న్ రైత‌న్నకు అండగా నిలుస్తుంద‌న్నారు. దేవ‌ర‌కొండ ఎమ్మెల్యే బాలూనాయ‌క్ మాట్లాడుతూ.. గ్రామంలో రైతులు ఎదుర్కొంటున్న భూ స‌మ‌స్యల‌ను వివ‌రించారు. వాస్తవంగా సాగులో ఉన్న వంద‌ల మంది రైతుల‌కు కొత్త పాస్ పుస్తకాలు రాలేద‌ని, ఈ గ్రామంలో ఉన్న వాస్తవ విస్తీర్ణం కంటే వంద‌ల ఎక‌రాల ఎక్కువ భూమికి పాస్ పుస్తకాలు జారీ అయ్యాయ‌న్నారు. దీని వ‌ల్ల నిజ‌మైన సాగుదారుడు రైతుబంధు, రైతుబీమా లాంటి ల‌బ్ధి పొంద‌లేక‌పోతున్నార‌ని ఆవేదన వ్యక్తం చేశారు. అట‌వీ భూముల‌కు హ‌క్కు ప‌త్రాలు వ‌చ్చినా ఆ భూముల‌ను సాగు చేసుకోవ‌డంలో అట‌వీ శాఖ నుంచి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు చెప్పారు. ప‌ట్టా భూములు నిషేధిత జాబితాలో చేర‌డం వ‌ల్ల అత్యవ‌స‌ర కుటుంబ ప‌రిస్థితుల‌కు అమ్ముకోలేని ప‌రిస్థితులు త‌లెత్తాయ‌ని చెప్పారు.

సీఎం రేవంత్ రెడ్డి సార‌థ్యంలో తీసుకొచ్చిన కొత్త భూ భార‌తి చ‌ట్టం భూ స‌మ‌స్యల‌కు స‌త్వర ప‌రిష్కారం చూపుతుంద‌న్నారు. రైతు సేవా ఫౌండేష‌న్ చేస్తున్న కృషిని అభినందించారు. కంబాల‌ప‌ల్లి గ్రామంలో భూస‌మ‌స్యల ప‌రిష్కారానికి రైతు సేవా ఫౌండేష‌న్ సాయం అందించాల‌ని కోరారు. స‌మావేశానికి అధ్యక్షత వ‌హించిన ఆర్డీవో ర‌మ‌ణారెడ్డి మాట్లాడుతూ.. భూమి సాగులో ఉండి కూడా ప‌ట్టాలు లేని రైతులు ఈ ప్రాంతంలో చాలా మంది ఉన్నార‌ని, ఈ స‌మ‌స్యల‌పై అధ్యయ‌నం చేస్తున్నామ‌న్నారు. కొత్త చట్టం అమ‌లులోకి వ‌చ్చాక స‌మ‌స్యల ప‌రిష్కారానికి కృషి చేస్తామ‌ని హామీ ఇచ్చారు. ఇటీవల శాస‌న‌స‌భ, శాస‌న‌ మండ‌లి కొత్త చ‌ట్టాన్ని ఆమోదించిన సంగ‌తి తెలిసిందే. ఈ చ‌ట్టంపై రాష్ట్రంలోనే తొలిసారిగా రైతు సేవా ఫౌండేష‌న్ అవ‌గాహ‌న కార్యక్రమాన్ని నిర్వహించింది. రైతు సేవా ఫౌండేష‌న్ చైర్మన్ భూమి సునీల్‌, వి.ల‌చ్చిరెడ్డి సారథ్యంలో నిర్వహించిన స‌ద‌స్సుకు దేవరకొండ ఆర్డీవో ర‌మ‌ణారెడ్డి అధ్యక్షత వ‌హించారు. త‌హ‌శీల్దార్, రెవెన్యూ సిబ్బంది, స్థానిక ప్రజా ప్రతినిధులు, గ్రామానికి చెందిన రైతులు స‌ద‌స్సులో పాల్గొన్నారు.

Tags:    

Similar News